న్యూఢిల్లీ:  మీకు శాలరీ అకౌంట్‌ ఉందా..? లేక గతంలో తీసుకున్న రుణాన్ని క్రమంగా తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారా..? అయితే, ఈ అవకాశం మీ కోసమే. మీలాంటి వాళ్లకు పలు బ్యాంకులు ‘కోవిడ్‌-19 వ్యక్తిగత రుణం’ ఆఫర్‌ చేస్తున్నాయి. కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుగా  రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందిస్తామంటున్నాయి. 

సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ 18-24 శాతం స్థాయిలో ఉంటుంది. కోవిడ్‌ పర్సనల్‌ లోన్స్‌ మాత్రం కనిష్ఠంగా 8 శాతం నుంచి గరిష్ఠంగా 15 శాతం వడ్డీకే లభించనున్నాయి. అంతేకాదు, ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి  మినహాయింపు లభించనుంది. క్రెడిట్‌ స్కోర్‌ కూడా 650 పాయింట్లు ఉంటే చాలంటున్నాయి బ్యాంకులు. 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో ఈ రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి.  

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు ఈ వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ రుణాల్లో చౌక వడ్డీ రేటు అత్యంత ఆకర్షణీయ అంశమని ఫైనాన్షియల్‌ ప్లానర్లు అంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు మంచి ప్రత్యామ్నాయమని ఫైనాన్సియల్ ప్లానర్లు చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి ఎప్పటికి అదుపులోకి వస్తుందని స్పష్టత లేనందున అదనపు రుణ భారాన్ని నెత్తిన వేసుకోకపోవడమే మేలని వారు అభిప్రాయపడ్డారు. 

ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర నిధిని ఉయోగించుకోవడం లేదా బ్యాంక్‌ అకౌంట్‌లోని కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టుకోవడం మేలంటున్నారు. మరే గత్యంతరం లేనట్లయితేనే దీన్ని ప్రత్యామ్నాయ మార్గంగా పరిగణించాలని ఫైనాన్సియల్ ప్లానర్లు చెబుతున్నారు.  

ఈ పర్సనల్ రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకులు కొన్ని షరతులను అమలు చేస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) కనీసం ఏడాది కాలం నుంచి తమ బ్యాంక్‌ ఖాతా నుంచి వేతనం అందుకుంటున్న వారికే ఈ లోన్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇప్పటికే బ్యాంక్‌ నుంచి గృహ లేదా వ్యక్తిగత రుణం తీసుకున్న వారూ అర్హులేనని అంటోంది. 

సహ్‌యోగ్‌ కోవిడ్‌-19 పేరుతో రుణం అందిస్తోన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. తమ వద్ద శాలరీ అకౌంట్‌ కలిగిన వారికి మాత్రమేనంటోంది. ఈ మధ్యనే పీఎన్‌బీలో విలీనమైన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ).. శాలరీ అకౌంట్‌ హోల్డర్లకూ ఈ పర్సనల్ లోన్ఆఫర్‌ వర్తించనుంది. 

also read:ప్లేన్ల టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ఫ్యూచర్

ఇక బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) తన గృహ రుణ ఖాతాదారులకు ఈ రుణాన్ని ఆఫర్‌ చేస్తోంది. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తన గృహ, వాహన రుణగ్రహీతలకు, స్థిరాస్థి తాకట్టుపై రుణం తీసుకున్న వారికి ఈ లోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) సైతం కనీసం 12 నెలల నుంచి తమ బ్యాంక్‌ ఖాతా ద్వారా వేతనం లేదా పెన్షన్‌ పొందుతున్న వారికి ఈ లోన్‌ ఆఫర్‌ చేస్తోంది. కనీసం ఏడాది క్రితం తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్న వారికీ అందుబాటులోకి తెచ్చింది.