న్యూఢిల్లీ‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 21 రోజులు కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి. వైరస్‌ విజృంభించకుండా అడ్డుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని కూడా మోదీ స్పష్టం చేశారు. 

ఈ మహమ్మారిని పారదోలాలంటే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. లేదంటే భారీ ఉత్పాతం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ పిలుపును ప్రముఖ వ్యాపారవేత్తలు స్వాగతించారు. 

కరోనాను కట్టడి చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇండియన్ కార్పోరేట్లు వ్యాఖ్యానించారు. అలాగే నిర్బంధ సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సూచించారు.

‘లాక్‌డౌన్‌ తప్పనిసరి. కానీ, దినసరి కూలీలు, ఒప్పంద కార్మికుల జీవనానికి ఇది కొంత కష్టమైన సమయమే. ప్రతి ఒక్కరం మనకంటే ఆర్థికంగా వెనకబడిన ఉన్న మూడు కుటుంబాలకు రోజువారీ రేషన్‌, ఇతర నిత్యావసరాలు అందిద్దాం’ అని ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ అభ్యర్థించారు.

బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పందిస్తూ.. ‘21 రోజుల లాక్‌డౌన్‌ ఉన్నతమైన చర్య. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరించాలి. ఈ సమయంలో పోలీసులు ప్రజల పట్ల మరీ తీవ్రంగా స్పందించొద్దు. అత్యసర సేవల్లో పని చేస్తున్న వారందరికీ మినహాయింపునిచ్చేలా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. 

‘ ప్రజల్ని అప్రమత్తం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ‘కనిపిస్తే కాల్చివేయండి అనే ఉత్తర్వులు ఇచ్చేదాకా తెచ్చుకోవద్దు’ అన్న వ్యాఖ్యలపైనా కిరణ్‌ మజుందార్‌ షా స్పందించారు. మరీ అంతటి కఠిన చర్యలకు దిగొద్దని విజ్ఞప్తి చేశారు. 

ఈ విషయంలో పోలీసులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కిరణ్ మజుందార్ షా తెలిపారు. అలాగే ఇప్పటికే ఆలస్యం అయిందన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు ఆమె చురకలంటించారు. లాక్‌డౌన్‌ వెనకున్న శాస్త్రీయతను గుర్తించి కేంద్రానికి సహకరించాలని కోరారు.

‘బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ సమయంలో పాటిస్తున్న ఓ వినూత్న పద్దతిని ట్విటర్‌ వేదికగా ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష గొయెంకా పంచుకున్నారు. మనమూ ఈ విధానాన్ని అవలంభిస్తూ ప్రభుత్వానికి సహకరిద్దాం అని పిలుపునిచ్చారు. 

also read:శుభవార్త: బ్యాంకుల్లో నో మినిమం బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీల్లేవు

బ్రిటన్‌లో లాక్‌డౌన్‌లో ఉన్న కొంతమంది తమ కిటికీ తలుపులకు ఆకుపచ్చ రంగు బోర్డులను తగిలించారు. అత్యవసర సాయం ఏదైనా.. అంటే నిత్యావసర వస్తువులు నిండుకోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ బోర్డు స్థానంలో ఎరుపు రంగు బోర్డు పెడుతున్నారు. 

మారిన బోర్డులకు అనుగుణంగా బ్రిటన్ పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది స్పందించి వారికి సహకరిస్తున్నారు. దీన్ని ఆర్పీజీ ఎంటర్ ప్రైజేస్ చైర్మన్ హర్ష గొయెంకా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రతిఒక్కరం అదే విధానాన్ని పాటిద్దాం అని పిలుపునిచ్చారు.