న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొన్ని కీలక ప్రకటనలు చేసింది. త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్రం వ్యాపారులు మొదలు సామాన్యుల వరకు పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నది. 

త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియాకు చెప్పారు. ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలపైనా, స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటల నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ ప్రతి రోజూ మూడు సార్లు సమీక్షిస్తున్నదన్నారు. 

కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎటీఎం చార్జీలు తాత్కాలికంగా ఎత్తి వేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ల పెంపుదల దిశగా పలు నిబంధనలను సడలించారు. కనుక ఇకపై చార్జీలు పడుతాయన్న భయంతో.. ఖాతాలున్న బ్యాంకుల ఏటీఎంల కోసం వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. 

కనిపించిన ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదును తీసుకోవచ్చు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బ్యాంక్‌ ఖాతాదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. వచ్చే మూడు నెలలు ఏటీఎం విత్ డ్రాయల్స్ మీద ఎటువంటి చార్జీలు ఉండబోవని ప్రకటించింది. 

ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఖాతాలు ఉన్న బ్యాంక్‌ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు, ఇతర ఏటీఎంలలో మూడుసార్లు నగదును ఉచితంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉన్నది. అయితే ఇప్పుడీ నిబంధనల్ని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 
ఏ బ్యాంక్‌ ఖాతాదారులైనా.. తమకు అందుబాటులో ఉన్న ఇతర ఏటీఎంలలో స్వేచ్ఛగా నగదును ఉపసంహరించుకోవచ్చని, జూన్‌ 30 వరకు చార్జీల భారం ఉండదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఖాతాల్లో కనీస నగదు నిల్వలనూ ఉంచనవసరం లేదని ఆమె వెల్లడించారు. మూడు నెలలపాటు ఇంతేనన్నారు. 

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బందులకు గురికావద్దన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిస్థితుల తీవ్రతనుబట్టి మరికొన్ని నెలలు ఈ సౌకర్యాలను పొడిగిస్తామని తెలిపారు. 

ఇక ప్రజల సేవింగ్స్ ఖాతాలపై కనీస నిల్వల కొనసాగింపునకు చార్జీల విధింపు నిబందనను తొలిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి అన్ని వాణిజ్య వినియోగదారులు చేపట్టే డిజిటల్ పేమెంట్స్ మీద బ్యాంకుల చార్జీలను తగ్గించి వేశారు.

కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థను భీకర మందగమనంలోకి నెట్టిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగరాదని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలను నిపుణులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్తంభించిన ఉత్పాదక, వ్యాపార లావాదేవీల మధ్య ఆయా సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. దీంతో మానవత్వం చూపాలని సూచిస్తున్నారు. 

మరోవైపు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..తన సిబ్బందికి శుభవార్తను అందించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నెల చివరివరకు ఈ సంస్థ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సిబ్బంది జీతాలు లేదా జీతాల బకాయిల్లో కోత విధించబోమని ఇండిగో సిబ్బందికి హామీ ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల చివరివరకు దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా కూడా ఉత్పత్తిని నిలిపివేసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరివరకు ప్లాంట్లో ప్రొడక్షన్‌ను నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా రోజువారిగా పరిశీలిస్తున్నట్లు, అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.