న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. ఈ యాప్‌ను ఇటీవల మద్రాసు హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు(సుమారు రూ.3.5కోట్లు) ఉందని సదరు కంపెనీ వాపోయింది. 

అంతేగాక, 250మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. వీడియోలకు సంగీతంతోపాటు అదనపు హంగులు జోడించి స్నేహితులతో పంచుకునే టిక్ టాక్ యాప్ మనదేశంలో బాగా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా యువత దీనికి బానిసలుగా మారిపోతున్నారు. 

ఈ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌కు పైగా వినియోగిస్తున్నారు. ఇక భారతదేశంలో 300మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ యాప్ కారణంగా పిల్లలు, యువత తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.

అంతేగాక, ఈ యాప్ ద్వారా అశ్లీలత పెరిగిపోయిందని ఇటీవల కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించింది. భారత్‌లో టిక్‌టాక్‌ డౌన్‌లోడ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ రంగంలోకి దిగడంతో ఆపిల్‌, గూగుల్‌లు తమ యాప్‌స్టోర్స్‌ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాయి. 

ఈ నేపథ్యంలో టిక్‌టాక్ యాప్ కొత్త వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో టిక్‌-టాక్‌ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌ను నష్టాలు చుట్టు ముట్టాయి. ఈ క్రమంలో బైట్‌ డ్యాన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

టిక్‌-టాక్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ మేరకు యాపిల్‌, గూగుల్‌ సంస్థలను ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. తమ యాప్‌పై నిషేధం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతోందని, రూ. కోట్లలో నష్టం వస్తోందని తెలిపింది.

అంతేగాక, తాము రోజుకు దాదాపు 1 మిలియన్ల కొత్త యూజర్లను కోల్పోతున్నామని బైట్ డ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వచ్చే బుధవారం మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది.

 

సంబంధిత వార్త: ‘నిర్ణయం తీసుకోండి లేదా టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తాం’