Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ వార్ ఎఫెక్ట్: ఆరు నెలల్లో భారత్ ఫార్మా సంస్థలకు చైనా అనుమతులు?

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చైనా ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా భారత జనరిక్‌ ఔషధాలకు గేట్లు బార్లా తెరవనున్నట్లు తెలుస్తోంది. 

China eyes Indian pharma as U.S. trade turns cloudy

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చైనా ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా భారత జనరిక్‌ ఔషధాలకు గేట్లు బార్లా తెరవనున్నట్లు తెలుస్తోంది. భారత ఫార్మా సంస్థలను ఆకర్షించడానికి చైనా నియంత్రణ మండళ్లు ఇక వేగంగా అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉందని ఔషధ రంగ ఎగుమతుల ప్రోత్సాహక మండలి అంటోంది. చైనాలో జనరిక్‌ ఔషధాలు, సాఫ్ట్‌వేర్‌, చక్కెర, బియ్యంతోపాటు పలు ఉత్పత్తులకు నెలకొన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి భారత కంపెనీలూ ఆసక్తిగా ఉన్నాయి.

భారత్ సంబంధాల మెరుగుదలకు చైనా సానుకూలం
భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చైనా సానుకూలంగా ఉన్నదని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న అధికార బృంద సభ్యుడొకరు తెలిపారు. అయితే, మనం చౌకగా ఉత్పత్తులు అందించగలగాలని ఆ అధికారి అన్నారు. ఇప్పటికైతే రెండు దేశాల మధ్య నిర్దిష్ట ఒప్పందాలేమీ జరగలేదు గానీ, భవిష్యత్‌లో భారత ఫార్మా కంపెనీలకు చైనా మార్కెట్లో అవకాశాలు భారీగా పెరిగే అవకాశముంది.

భారత సంస్థలకు ఆరు నెలల్లో అనుమతులు
ఇకపై చైనా ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే దేశీ సంస్థలకు ఎగుమతి లైసెన్సులు లభించవచ్చని ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) చైర్మన్‌ దినేష్‌ దువా సంకేతాలిచ్చారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) అనుమతులు పొందిన ఇండియన్‌ కంపెనీలకు వేగంగా లైసెన్స్‌ మంజూరు చేయాలని చైనా ప్రభుత్వం వారి అధికారులను ఆదేశించినట్లుగా తెలియవచ్చిందని దువా అన్నారు. ఇండియన్‌ ఫార్మాకు కీలక మార్కెట్లలో ఇయు ఒకటి. 2016-17లో నమోదైన ఔషధ ఎగుమతుల్లో 15 శాతం ఇయుకు సరఫరా అయ్యాయి.
 
చైనాలో విస్తరణకు భారత్ ఫార్మా సంస్థల ప్రయత్నాలు
సన్‌ఫార్మా, లుపిన్‌, అరబిందో ఫార్మాతోపాటు పలు ఔషధ సంస్థలు చైనా మార్కెట్‌లో విస్తరించేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, అక్కడి కఠిన నియంత్రణ చట్టాల కారణంగా సాధ్యపడటం లేదు. ఇండియన్‌ కంపెనీలకు చెందిన 250 దరఖాస్తులు చైనా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సిఎ్‌ఫడిఎ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కొన్ని చానాళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు.
 
ఇక భారతీయ ఫార్మా కంపెనీలకు పండగే
త్వరలోనే ఇండియన్‌ ఫార్మా కంపెనీలకు గేట్లు పూర్తిగా తెరవబోతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునింగ్‌ సంకేతాలిచ్చారు. చైనాలోకి దిగుమతయ్యే భారత ఔషధాలు, ముఖ్యంగా కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందులపై సుంకాల భారం తగ్గించే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ వారంలో జరిగిన ఓ కార్యక్రమంలో చునింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వారి మార్కెట్లో కేన్సర్‌ ఔషధాల విక్రయానికి భారత కంపెనీలకు లైసెన్సులిచ్చేందుకు చైనా ఒప్పుకుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

లైసెన్సుల మంజూరుకు అంగీకరిస్తే వ్యాపార అవకాశాలు పెరుగుదల
ఒకవేళ లైసెన్సుల మంజూరుకు చైనా అంగీకరిస్తే మన ఫార్మా కంపెనీలకు వ్యాపారావకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, చైనాలో ఏటా 43 లక్షల మంది కేన్సర్‌ బారిన పడుతున్నారని, చౌకగా లభించే జనరిక్‌ ఔషధాలకు భారీగా డిమాండ్‌ నెలకొందని ఆ దేశ సెంట్రల్‌ టెలివిజన్‌ నివేదిక పేర్కొంది.
 
భారత ఫార్మా ఎగ్జిక్యూటివ్‌లకు చైనా శిక్షణ
వీలైనంత త్వరగా చైనా మార్కెట్లోకి ప్రవేశించేందుకు సాయపడేలా ఇండియన్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌లకు తగిన శిక్షణ ఇచ్చేందుకు చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత సంస్థలు చైనా భాగస్వామిని నియమించుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ఫార్మెక్సిల్‌, చైనా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఫర్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌ ప్రొడక్ట్స్‌ త్వరలో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. 

ఢిల్లీ ఎంబసీలో ఫార్మా కోసం ప్రత్యేక డెస్క్
అంతేకాదు చైనా త్వరలోనే న్యూఢిల్లీలోని తన ఎంబసీలో ఇండియన్‌ ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేయనుందని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు, ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) చైర్మన్‌ దినేష్‌ దువా తెలిపారు. ప్రపంచ జనరిక్‌ ఔషధాల మార్కెట్లో ఇండియానే అగ్రగామి. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా, యూరప్‌తోపాటు ఇతర దేశాలకు 1,730 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేశాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫార్మా మార్కెట్‌ అయిన చైనాకు ఎగుమతైంది అందులో ఒక శాతమే.
 
ద్వైపాక్షిక వాణిజ్యం 8,960 కోట్ల డాలర్లు
గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో మన ద్వైపాక్షిక వాణిజ్యం 8,960 కోట్ల డాలర్లకు చేరుకుంది. అలాగే వాణిజ్య లోటు 6,290 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే ఇండియా నుంచి చైనాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల విలువ కంటే చైనా నుంచి మన దేశంలోకి దిగుమతయ్యే ఉత్పత్తుల విలువ 6,290 కోట్ల డాలర్లు అధికం అన్నమాట. గత దశాబ్దంలో చైనాతో భారత్‌ వాణిజ్య లోటు 9 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో చైనాకు భారత్‌ నుంచి ఎగుమతులను పెంచేందుకున్న మార్గాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చిస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios