ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం భారత బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఇరాన్ కి ఎగుమతి కావాల్సిన లక్ష టన్నుల బియ్యం భారత బందర్లలో నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి రైస్ ధర భారీగా పడిపోయింది.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం.. భారతీయ బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సంక్షోభానికి దారితీసింది. ఇరాన్‌కి వెళ్లాల్సిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం భారతీయ బందర్లలోనే ఆగిపోయిందని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ తెలిపింది. సరుకుల సరఫరా నిలిచిపోవడం, చెల్లింపుల్లో ఆలస్యం, ధరలు పడిపోవడంతో భారత బాస్మతి ఎగుమతిదారులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇబ్బందులు
ప్రస్తుతం ఇరాన్‌కి పంపాల్సిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం ఇప్పుడు భారతీయ బందర్లలోనే నిలిచిపోయింది. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంలో ఇరాన్ వాటా 18-20 శాతం ఉంటుందని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపారు.
గుజరాత్‌లోని కాండ్లా, ముంద్రా బందర్లలో సరుకు ఎక్కువగా ఆగిపోయిందని... రెండు దేశాల గొడవల వల్ల ఇరాన్‌కి వెళ్లే షిప్పులకి ఇన్సూరెన్స్ దొరకట్లేదని గోయల్ తెలిపారు. అంతర్జాతీయ గొడవలు సాధారణంగా స్టాండర్డ్ షిప్పింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండవని.. దీనివల్ల ఎగుమతిదారులు సరుకు పంపలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
షిప్పింగ్ ఆలస్యం, చెల్లింపుల్లో అనిశ్చితి వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని.. దానివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి బియ్యం ధర కిలోకి 4-5 రూపాయలు తగ్గిందని గోయల్ చెప్పారు.
ఈ విషయం గురించి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)తో.. అసోసియేషన్ మాట్లాడుతోందన్నారు. ఈ సమస్యపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జూన్ 30న సమావేశం ఉందని ఆయన తెలిపారు.
భారతదేశం నుంచి ఎన్ని టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతవుతుంది?
2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి మొత్తం 60 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేసింది. బాస్మతి రైస్ కి ఎక్కువగా మధ్య ప్రాచ్య, పశ్చిమ ఆసియా దేశాల నుంచి డిమాండ్ ఉంది. ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా కూడా బాస్మతి బియ్యం కొంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్-ఇరాన్ గొడవలు ఎక్కువయ్యాయి. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా కూడా ఈ యుద్ధంలో పాల్గొంటోంది.
సౌదీ అరేబియా తర్వాత భారతదేశం నుంచి బాస్మతి బియ్యం ఎక్కువగా కొనే దేశం ఇరాన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఇరాన్‌కి దాదాపు 10 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ మార్కెట్లో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కరెన్సీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల భారతీయ బియ్యం ఎగుమతిదారులకు కొత్త సమస్య వచ్చిందనే చెప్పాలి.


