Asianet News TeluguAsianet News Telugu

ప్లేన్ల టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ఫ్యూచర్

కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు విధించిన లాక్‌డౌన్‌ దేశీయ విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. తాజాగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించటంతో ఈ రంగం పరిస్థితి మరింత దారుణంగా మారే పరిస్థితి కనిపిస్తోంది

Indian carriers, except IndiGo, need to raise $2.5 bln to survive grounding
Author
New Delhi, First Published May 3, 2020, 11:25 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు విధించిన లాక్‌డౌన్‌ దేశీయ విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. తాజాగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించటంతో ఈ రంగం పరిస్థితి మరింత దారుణంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసినా చాలా విమానయాన సంస్థలు తమ విమానాల్ని నడిపే పరిస్థితిలో లేవు. 

మిగిలిన ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఈ సంస్థల విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరాలంటే వీటికి వెంటనే సుమారు రూ.19 వేల కోట్ల (250 కోట్ల డాలర్లు) నిధులు అవసరమని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ తన తాజా నివేదికలో పేర్కొంది. 

అనూహ్య పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగితే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కష్టాలు తప్పవని కాపా ఇండియా హెచ్చరించింది. మార్చి 25 నుంచి దేశంలోని ప్రయాణికుల విమానాలన్నీ విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. విమానాలు పూర్తి స్థాయి ప్రయాణికులతో గాల్లోకి ఎగురుతాయా? అంటే అనుమానమే. 

లాక్ డౌన్ ఎత్తివేసినా సామాజిక దూరం నిబంధనలను పాటించాల్సి రావడంతో 180 సీట్లున్న విమానంలో మహా అయితే 108 మందికి మించి ప్రయాణికుల్ని తీసుకెళ్లే పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టికెట్‌ చార్జీలు భారీగా పెంచితే తప్ప ఆ స్థాయిలో విమానాలు నడపడం గిట్టుబాటు కాదు.

ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు పెంచే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ ఎత్తివేసినా ఇప్పటికిప్పుడు విమాన  సర్వీసులు ప్రారంభించక పోవడమే మంచిదని చాలా విమానయాన సంస్థలు  భావిస్తున్నట్టు సమాచారం.

కాగా లాక్‌డౌన్‌ వల్ల ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ 45 శాతం తగ్గి దేశీయ విమానయాన సంస్థలు 1,120 కోట్ల డాలర్ల (సుమారు రూ.85,120 కోట్లు) మేర రాబడులు నష్టపోతాయని అంచనా. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ రూపకల్పన పైనే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల భవితవ్యం ఆధారపడి ఉంటుందని కాపా ఇండియా అంచనా వేసింది. దేశీయ ప్రయాణికులకు రీఫండ్ రూపేణా 300 మిలియన్ల డాలర్లు ఇవ్వాల్సి రావడం ఎయిర్ లైన్స్ సంస్థలకు సవాలేనని తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 55-70 మిలియన్ల మంది దేశీయ ప్రయాణికులు, 20-27 మిలియన్ల విదేశీ ప్రయాణికులు ఉండొచ్చునని కాపా ఇండియా అంచనా. ఏటా ప్యాసింజర్ల డిమాండ్ 47 శాతం పడిపోతుండగా, లక్షల ఉద్యోగాలు రిస్కులో పడుతున్నాయి. ప్రభుత్వం, పరిశ్రమ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం పౌర విమానయాన రంగం కోలుకోవడం కష్టమేనని కాపా ఇండియా వ్యాఖ్యానించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios