ముంబై: భారత అపర కుబేరుడు, ఆసియా సంపన్నుడు రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ సంపద 2019లో అక్షరాలా 17 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.2లక్షల కోట్లు. దీంతో ఈ నెల 23వ తేదీ నాటికి అంబానీ మొత్తం సంపద 61 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 4.3లక్షల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌ పేర్కొంది. 

ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద ఈ ఏడాది 11.3 బిలియన్‌ డాలర్లు పెరగగా.. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 13.2 బిలియన్‌ డాలర్లు కోల్పోవడం గమనార్హం. ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు 40శాతం పెరగడంతో అంబానీ సంపద కూడా భారీగా పెరిగింది.

also read  ఇండియాలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ ఏదో తెలుసా...?

మూడేళ్ల క్రితం రిలయన్స్ తీసుకొచ్చిన జియో.. అనతికాలంలోనే భారత్‌లో అగ్రగామి టెలికాం ఆపరేటర్‌గా ఎదిగింది. ఈ విజయం కంపెనీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దీంతోపాటు రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు.

2021 ప్రారంభం నాటికి రిలయన్స్‌ గ్రూప్‌‌ను రుణ రహితంగా ఉండేలా చూస్తామని ఇటీవల ముఖేశ్‌ అంబానీ కూడా ప్రకటించారు. ఇందులో భాగంగానే రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారంలో కొన్ని వాటాలను సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోకు విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2016లో జియో మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు రిలయన్స్‌ షేర్లు మూడింతలు పెరగడం విశేషం.

అయితే, ప్రపంచ ఇంధన దిగ్గజ సంస్థ సౌదీ ఆరామ్‌కో సంస్థతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) వాటా విక్రయ ఒప్పందం ఆగిపోనుందన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. దీంతో మదుపర్లు దాదాపుగా రూ.18వేల కోట్ల మేర నష్టపోయారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో రిలయన్స్‌ సూచీ 1.78 శాతం కోల్పోయి రూ.1,571 వద్ద ముగిసింది. 

ఇంట్రా ట్రేడింగ్‌లో ఏకంగా 2.77 శాతం పతనమైన ఈ స్టాక్‌ రూ.1,555 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీలో ఈ స్టాక్‌ 1.76 శాతం మేర తగ్గి రూ.1,570.95 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఆ కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా రూ.17,9990.13 కోల్పోయి రూ.9,95,888.87 కోట్లకు కుంగింది. 

also read నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించనున్న గూగుల్

సోమవారం ఒక్క సెషన్‌లోనే దాదాపుగా 12.74 లక్షల రిలయన్స్ షేర్లు చేతులు మారాయి. నిఫ్టీలో కోటి షేర్లు మార్పిడి జరిగాయి. ఆరామ్‌కో, రిలయన్స్‌ మధ్య కుదిరిన 15 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంలో అనిశ్చితి నెలకొందని గత వారం పలు నివేదికలు వచ్చాయి.

మరోవైపు పెన్నా ముక్తా, తపతి చమురు గ్యాస్‌ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల (రూ.24,500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ, ఈ బకాయిలను చెల్లించిన తర్వాతే చమురు, కెమికల్స్‌ బిజినెస్‌లో 25% వాటాను ఆరామ్‌కో కంపెనీకి రిలయన్స్‌ విక్రయించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఆఫిడవిట్‌ వేయడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.