Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ ఏదో తెలుసా...?

నిజాం సంస్థానం హైదరాబాద్ నగరం. భాగ్యనగరిలో వీక్షించడానికి పలు ప్రత్యేకతలు. చార్మినార్, గోల్కొండ టూంబ్స్, బిర్లా టెంపుల్ ఇంకా ఎన్నెన్నో విశేషాలు.. వింతలు.. వాటిని తిలకించేందుకు హైదరాబాద్ నగరానికి పర్యాటకులు బారులు తీరారు. భారతదేశంలోనే హైదరాబాద్ అత్యంత పర్యాటక నగరంగా పేరొందింది. కానీ అంతర్జాతీయంగా మాత్రం  దుబాయ్‌దే అగ్రస్థానం అని తేలింది.  
 

Hyderabad, Dubai most preferred destinations for Indians in 2019: Report
Author
Hyderabad, First Published Dec 24, 2019, 10:28 AM IST

ముంబై:చారిత్రక నగరం హైదరాబాద్‌కు పర్యాటకులు క్యూ కట్టారు. భాగ్యనగరం అందాలను తిలకించేందుకు ఈ ఏడాది పోటీపడ్డారు. 2019లో దేశంలోనే అత్యధిక మంది పర్యాటకులు సందర్శించిన నగరాల్లో హైదరాబాదే టాప్‌. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి టూరిస్టుల తాకిడి ఈ ఏడాది ఎక్కువగా కనిపించిందని ఓ తాజా సర్వేలో తేలింది. 

డిజిటల్‌ ట్రావెల్‌ కంపెనీ ‘బుకింగ్ డాట్ కామ్’ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో అత్యధిక భారతీయులు హైదరాబాద్‌ను సందర్శించేందుకు ప్రయాణాలను బుక్‌ చేసుకున్నారు. టాప్‌-5లో హైదరాబాద్‌ తర్వాతీ నగరాల్లో వరుసగా పుణె, జైపూర్‌, కొచ్చి, మైసూర్‌ ఉన్నాయి. 

also read నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించనున్న గూగుల్

షిల్లాంగ్‌, మంగళూరు, రిషికేశ్‌, గువాహటి, పుణెలకు గతకొంత కాలంగా దేశీయ పర్యాటకుల రాక పెరిగిందని బుకింగ్‌డాట్‌కామ్‌ ఇండియా, శ్రీలంక, మాల్దీవుల మేనేజర్‌ రితు మెహ్రోత్రా చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 వరకు జరిగిన బుకింగ్స్‌ ఆధారంగా ఈ సర్వే చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ సొగసులంటే భారతీయులకే కాదు విదేశీయులకూ ఇష్టమేనట. అందుకే ఈ ఏడాది విదేశాల నుంచి భాగ్యనగరం చేరుకున్న పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఇజ్రాయెల్‌, బంగ్లాదేశ్‌, పోలండ్‌, జపాన్‌, సింగపూర్‌ వాసులు.. 2019లో భారత్‌ సందర్శనకు వచ్చిన విదేశీ టూరిస్టుల్లో ఎక్కువగా కనిపించారు. 

Hyderabad, Dubai most preferred destinations for Indians in 2019: Report

విదేశీ పర్యాటకుల్లో మెజార్టీ టూరిస్టులు జైపూర్‌ తర్వాత హైదరాబాద్‌కే వచ్చారని సర్వేలో స్పష్టమైంది. ఆ తర్వాత పుణె, కొచ్చి, ఆగ్రా ఉండగా, ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)‌, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలనూ చూడటానికి ఆసక్తి కనబరిచారని బుకింగ్‌డాట్‌కామ్‌ ఇండియా, శ్రీలంక, మాల్దీవుల మేనేజర్‌ రితు మెహ్రోత్రా చెప్పారు. 

also read  2019 Round Up: ఎండాకాలంలో వాటికి డిమాండ్...టీవీలు, ఓవెన్లకు నో రెస్పాన్.. కానీ..

ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా వెళ్లిన విదేశీ నగరాల్లో దుబాయ్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బ్యాంకాక్‌ ఉండగా, ఆ తర్వాతీ స్థానాల్లో సింగపూర్‌, లండన్‌, కౌలాలంపూర్‌ ఉన్నాయి. ఇస్తాంబుల్‌ (టర్కీ), ఫుకెట్‌ (పటాంగ్‌ బీచ్‌), వియత్నాం (హనోయ్‌, హోచి మిన్‌ సిటీ), ఉబుద్‌ (ఇండోనేషియా), టోక్యో (జపాన్‌) నగరాలనూ చూసే భారతీయులు పెరుగుతున్నారని మెహ్రోత్రా తెలిపారు.

‘దేశ, విదేశీ ప్రయాణాలకు చాలామంది ప్రాధాన్యతను ఇస్తుండటంతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. త్వరలోనే కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నాం. ఈ దశాబ్దంలో చాలా మార్పులను చూశాం. 2020తో మరింత వృద్ధిని అందుకుంటామనే విశ్వాసం ఉన్నది’ అని బుకింగ్‌డాట్‌కామ్‌ ఇండియా, శ్రీలంక, మాల్దీవుల మేనేజర్‌ రితు మెహ్రోత్రా చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ‘బుకింగ్ డాట్ కామ్’ సేవలు అందుబాటులో ఉన్నాయి. టూరిస్టులకు అన్ని రకాల వసతి, ప్రయాణ సదుపాయాలను తాము అందిస్తున్నామని మెహ్రోత్రా వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios