దేశ పరిశ్రామిక రంగంలో ఓ న్యూస్ కలకలం రేపుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రియలన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.?
KNOW
రూ. 17 వేల కోట్ల మోసం?
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. రూ.17వేల కోట్ల విలువైన లోన్ మోసం, మనీ లాండరింగ్ కేసుల్లో ఆయనను విచారణకు పిలిచింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
లోన్ మోసం ఆరోపణలు
అనిల్ అంబానీ కంపెనీలు 2017-19 మధ్య యెస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.3,000 కోట్ల రుణం తీసుకున్నాయి. ఈ నిధులను అనుమతి లేకుండా ఇతర లావాదేవీలకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న మరో రూ.10వేల కోట్ల రుణాన్ని కూడా తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కేసుల్లో లంచాలు ఇచ్చినట్టు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్టు సమాచారం.
సోదాలు – కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
జూలై 24 నుంచి మూడు రోజులపాటు ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్‌కి చెందిన 35 ప్రాంతాలు, 50కి పైగా కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్‌నర్స్ నివాసాలపై తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు ముఖ్యమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదనంగా భువనేశ్వర్‌లో మూడు ప్రాంగణాలు, కోల్‌కతాలో ఒక చోట సోదాలు చేసి, రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ విషయాన్ని కూడా బయటపెట్టారు.
మనీ లాండరింగ్ చట్టం కింద విచారణ
ఈ కేసు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైంది. సోదాల్లో లభించిన సాక్ష్యాల ఆధారంగా అనిల్ అంబానీతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములపై కూడా విచారణ కొనసాగనుంది. ఈడీ, CBI కేసులను అనుసంధానించి మరిన్ని అంశాలను పరిశీలిస్తోంది.
పరిశ్రమలో సంచలనం
రిలయన్స్ గ్రూప్‌పై ఇంత భారీ స్థాయిలో దర్యాప్తు జరగడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీకి ఈ కేసులు మరో పెద్ద సవాలుగా మారాయి. ట్రైబ్యునల్స్, కోర్టులలో ఆయన కంపెనీలకు పలు కేసులు నడుస్తున్న నేపథ్యంలో, ఈడీ నోటీసులు కొత్త మలుపు తీసుకొచ్చాయి.
