అమేజింగ్ మిస్టేక్.. కుర్రాళ్లు కుమ్మేశారు!!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన పొరపాటును విద్యార్థులు ఓ ఆటాడుకున్నారు. బ్రిటన్ లో విద్యార్థులకు ‘వెల్ కమ్ 5’ పేరుతో ఒక ఆఫర్ ఇచ్చింది. కానీ దాన్ని టెక్నికల్‌గా రిస్ట్రిక్ట్ చేయడం మరిచిపోయింది. ఫలితంగా బ్రిటన్ విద్యార్థులు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లిందని సమాచారం.
లండన్: ప్రముఖ ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్ చేసిన ఓ చిన్న పొరపాటు విద్యార్థులకు వర ప్రదాయినిగా మారింది. బ్రిటన్ విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెజాన్ ఇచ్చిన ఓ ఆఫర్‌లో చిన్న పొరపాటు వల్ల కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది.
బ్రిటన్‌లో చదువుకుంటున్న విద్యార్థులు అమెజాన్ ద్వారా ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ‘వెల్‌కమ్5’ అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే వారికి దాదాపు రూ.450 విలువైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతే విలువ ఉన్న వస్తువునే కొనుగోలు చేస్తే పైసా ఖర్చు చేయకుండా ఉచితంగా దానిని పొందవచ్చు.
also read ఇక ఆన్ లైన్ లో చేనేత వస్త్రాల అమ్మకాలు
అయితే ఈ కోడ్ కేవలం ఒక్కసారే పనిచేస్తుందని అమెజాన్ తెలిపింది. దీంతో అక్కడి విద్యార్థులు మొదటి సారి ఉచితంగా వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. కొందరు విద్యార్థులు రెండోసారి కూడా సరదాగా ఆ కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయడంతో వెబ్‌సైట్ తీసుకుంది. దీంతో మరోసారి అతడు కొనుగోలు చేశాడు.
ఈ సంగతి ఆ నోటా ఈనోటా పాకడంతో బ్రిటన్ వ్యాప్తంగా విద్యార్థులు చెలరేగిపోయారు. ఒకే ఖాతా నుంచి వందల ఆర్డర్లు చేస్తూ నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్డర్లు పెడుతూనే ఉన్నారు. వారి దెబ్బకు ఒకానొక దశలో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో టూత్‌పేస్ట్ ఉందంటే ఎంత మంది ఈ ఆఫర్‌ను వినియోగించుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఒక కాలేజీ సమీపంలో ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న విద్యార్థి ఈ ఆఫర్‌ను ఎంతలా వాడుకున్నాడంటే.. ఆర్డర్ చేసిన వస్తువులు పెట్టుకోడానికి ఫ్లాట్ సరిపోక చాలా వస్తువులను తన ఇంటికి పంపేశాడు. ఎన్నో కాలేజీ హాస్టళ్లకు ఉదయం నుంచి రాత్రి వరకు నిమిషం గడువు లేకుండా వస్తువుల డెలివరీలు జరిగాయంటే అమెజాన్ చేసిన పొరపాటును విద్యార్థులు ఎలా కుమ్మేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
also read రిలయన్స్ జ్యుయెల్స్ ప్రధాన స్టోర్ ప్రారంభం
ఒకే ఖాతా నుంచి వందల ఆర్డర్లు వస్తున్నా అమెజాన్ మాత్రం జరిగిన పొరపాటును 10 రోజులు గడిచినా గుర్తించలేకపోయింది. అక్టోబర్ 15 నుంచి గత గురువారం వరకు ఈ ఆఫర్ ద్వారా కొన్ని లక్షల వస్తువులను విద్యార్థులు ఉచితంగా పొందారు. జరిగిన పొరపాటు ఆలస్యంగా తెలుసుకున్న అమెజాన్ వెంటనే తప్పును సరిచేసుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అమెజాన్ కోట్ల రూపాయలను నష్టపోయింది. అమెజాన్ పొరపాటుపై విద్యార్థులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలకు ఇదేమంత పెద్ద నష్టం కాదని.. పైగా ఇలా జరగడం వల్ల కంపెనీ పేరు మారుమోగుతుందని అంటున్నారు. ఈ ఆఫర్ కోడ్ ద్వారా తమ మనసుల్లో అమెజాన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందంటూ ఉచితంగా వస్తువులను పొందిన విద్యార్థులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.