చేనేత రంగం అభివృద్ధికి ఏపి  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కొత్త ఆలోచన చేసారు. దేశవిదేశాలకు సైతం చేనేత ఉత్పత్తులను అందుబాటులో తీసుకెళ్లే విధంగా మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి  తీసుకురానున్నారు.

ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీని వైఎస్‌ జగన్‌  చేనేత రంగం అభివృద్ధికి ‘వైఎస్సార్‌ చేనేత నేస్తం’ పేరుతో చేనేత ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో  అమ్మకాలు చేయడానికి  ఆ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

also read ధంతెరాస్ వేళ ....మెరవని బంగారం...

ఆడవాళ్ళు ఇష్టపడే ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, అమ్మాయిల కోసం చేనేత డ్రస్‌ మెటీరియల్స్‌, మగవారి కోసం చొక్కాలు, ధోతులు. ఇలా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటి కోసం దుకాణాలు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక్క క్లిక్‌తో ఇంటికి వచ్చి చేరుతాయి. మనసుకు నచ్చిన రంగులు, డిజైన్లను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇందుకోసం ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలిదశలో 25 ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా నవంబర్‌ 1వ తేదీ నుంచి విక్రయాలు చేపట్టనున్నారు. అదే నెల చివరి వారం నుంచి ఫ్లిప్‌కార్టు ద్వారా అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి.  

మొత్తంగా 25 రకాల చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా చీరలు(కాటన్, సిల్కు), డ్రస్‌ మెటీరియల్స్, చున్నీలు, చొక్కాలు, ధోవతులు, బెడ్‌ షీట్లు, టవళ్లు, దిండు కవర్లు, లుంగీలు, చేతి రుమాళ్లు తదితరాలు ఉన్నాయి. ఇందులోనూ రకానికి వెయ్యి చొప్పున అందుబాటులోకి తేనున్నారు.

అమ్ముడు పోని వస్త్రాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. కొత్త డిజైన్లను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆయా ఉత్పత్తుల ఫొటోలను సిద్దం చేశారు. ప్రతి చీరకు సంబంధించి బార్డర్, బాడీ, కొంగు కనిపించేలా మూడు ఆకర్షణీయమైన ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు.  

తొలి విడతగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్‌లైన్‌లో వస్త్రాల అమ్మకాలు సాగించనున్నారు. ఇందులో భాగంగా రూ. 500 నుంచి రూ. 20 వేల వరకు ధర ఉన్న వాటిని అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్రంలో ప్రాచూర్యం కలిగిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పెడన, పొందూరు, వెంకటగిరి, మాధవరం తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను విక్రయాలకు ఉంచనున్నారు. బయటి మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు వీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. చేనేత వస్త్రాల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా వాటిపై ప్రభుత్వ గుర్తింపు లోగోను ముద్రించనున్నారు.  

also read రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ ప్ర‌ధాన స్టోర్‌ ప్రారంభం


మాస్టర్‌ వీవర్లతో సమావేశమవుతాం 
ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాల విక్రయాలకు సంబంధించి జిల్లాలో ఉన్న మాస్టర్‌ వీవర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నాం. ఈ వ్యాపారంపై వారికి పూర్తి అవగాహన కల్పించనున్నాం. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా చేనేతలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది.  
– భీమయ్య, ఏడీ, జిల్లా చేనేత, జౌళి శాఖ 
 
పైలెట్‌ ప్రాజెక్టుగా విజయవాడలో అమలు 
నవంబర్‌ 1 నుంచి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు విస్తరించనున్నారు. దీని ద్వారా చేనేతలు పెద్ద ఎత్తున లాభపడతారు. 
– నారాయణస్వామి, ఏఎంఓ, ఆప్కో