న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో క్యాపిటలైజేషన్ విలువ పరంగా.. దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను టీసీఎస్‌ వెనక్కి నెట్టింది. గత నాలుగు సెషన్లలో 10.79 శాతం కోల్పోయిన ఆర్‌ఐఎల్‌ షేర్. రూ.1255.15కు చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్‌ విలువ బీఎస్‌ఈలో రూ.7,95,628.55 కోట్లకు చేరింది. అంటే నాలుగు సెషన్లలోనే రిలయన్స్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. లక్ష కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.8,13,779.67 కోట్లుగా ఉంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అంతర్జాతీయ ప్రతికూలతతో పాటు.. పలు దిగ్గజ సంస్థలు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుండడం, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తేదీలు దగ్గర పడుతుండడంతో తదితర కారణాలతో మదుపరులు భారీగా స్టాక్స్‌ అమ్మేస్తున్నారు. 
ఫలితంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఇదే క్రమంలో బుధవారం కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. 

ట్రేడింగ్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లు నష్టపోయి 38,043 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,429 వద్ద ట్రేడయ్యాయి. తర్వాత ప్రధాన రంగాల్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సూచీలు చివరల్లో మరింత పతనమయ్యాయి. 

ఓ దశలో సెన్సెక్స్‌ 517 పాయింట్లు పతనమై 38 వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ సైతం 102 పాయింట్లు కోల్పోయి 11,396కు చేరింది. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. 

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 487.50 పాయింట్లు నష్టపోయి 37,789.13 వద్ద ముగియగా.. నిఫ్టీ 138.45 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,359.45 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 18 పైసల మేర క్షీణించింది. 

సెన్సెక్స్‌లో దాదాపు 28 స్టాక్స్‌ నష్టాల్లోకి జారుకున్నాయి. కేవలం రెండు స్క్రిప్‌లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. దీంతో గడిచిన ఐదు సెషన్లలో స్టాక్‌ మార్కెట్లలో మదుపరులు దాదాపు రూ.5.61 లక్షల కోట్ల సొమ్మును నష్టపోయారు. 

గత నెల 26న రూ.1,53,08,828.49 కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిలైజేషన్‌ బుధవారానికి రూ.1,47,47,869.63 కోట్లకు కుంగింది. కేవలం బుధవారం ఒక్కరోజే దాదాపు రూ.1.67 లక్షల కోట్ల మేర మదుపరుల సొమ్ము ఆవిరైపోయింది. దేశీయ మార్కెట్లో దాదాపు 240 ప్రముఖ స్టాక్స్‌ ఏడాది కనిష్టానికి పడిపోయాయి. 

ఇలా నష్టపోయిన స్టాక్స్‌ జాబితాలో అమరరాజా, అపోలో టైర్స్‌, బాష్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌, క్యాడిలా వంటి సంస్థలు ఉన్నాయి. మరోవైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు 10 శాతం క్షీణించగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, వేదాంత బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు దాదాపు 3 శాతం మేర నష్టాలను చవిచూశాయి.

చైనా-అమెరికా మధ్య సాగిన వాణిజ్య యుద్ధంలో తాజా పరిణామాల రీత్యా ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడువుతుండడం, అమెరికా సూచీలు కూడా భారీగా నష్టపోతుండడం భారత మార్కెట్లను భయపెడుతోంది. జపాన్‌, కొరియా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ ధోరణిని పరిశీలిస్తున్న దేశీయ మదుపరులు భారీగా స్టాక్‌ విక్రయాలకు దిగుతున్నారు.

దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తేదీలు దగ్గర పడుతుండడం.. ఈ దఫా ఎన్నికల్లో కేంద్రంలోని మోడీ సర్కారు మెజార్టీ మార్కు సీట్లు రావన్న విశ్లేషణలతో మదుపరుల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో మదుపరులు భారీగా స్టాక్స్‌ విక్రయాలకు పాల్పడుతున్నట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాలకే పరిమితం అవుతున్నట్టుగా బ్రోకర్లు విశ్లేషిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రానున్న మరోపక్షం రోజులు దాదాపు స్టాక్‌మార్కెట్లలో ఇదే తరహాఊగిసలాట నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది..