Asianet News TeluguAsianet News Telugu

అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతున్న బ్యాంక్‌లు.. పరిశ్రమలకు కష్టాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ ఢమాల్ అంది. పీఎన్‌బీ మోసంతో రుణాలు ఇచ్చేందుకు  బ్యాంకులు వెనుకాడుతున్నాయి.

A Diamond scandal is hurting India economy in grip of slowdown
Author
New Delhi, First Published Dec 15, 2019, 1:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ దేశీయ బ్యాంకులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ముంచేసిన వజ్రాల వ్యాపారి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.14 వేల కోట్ల పై చిలుకు మోసగించి విదేశాలకు పారిపోయాడు.

అఫ్ కోర్స్.. ప్రస్తుతం బ్రిటన్ జైలులో మగ్గుతున్నాడు.. భారతదేశానికి అప్పగింతపై విచారణ ప్రక్రియ సాగుతున్నది అదే వేరే సంగతి కానీ ఆ నీరవ్ వల్ల ఇప్పుడు దేశాన్ని మందగమనం నుంచి బయట పడేసేందుకు మోదీ సర్కారు నానా తంటాలే పడుతున్నది. 

Read Also: జీఎస్టీ పెంపుపై ఊసే లేదు...అంతా ట్రాష్ అన్న ‘నిర్మల’మ్మ

దేశ చరివూతలోనే అతిపెద్ద బ్యాంక్ మోసంగా చెప్పుకుంటున్న పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకులు రుణాలను మంజూరు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.  దీంతో వివిధ వ్యాపారాలకు రుణాల మంజూరు దారుణంగా పడిపోగా, ఆయా రంగాల వ్యాపారంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతున్నది. 

అటు రిజర్వ్ బ్యాంక్, ఇటు కేంద్ర ప్రభుత్వం రుణాలను పెంచేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. బ్యాంకర్లను మాత్రం భయాలు వీడటం లేదు. నీరవ్ మోదీ సెగ నగల వర్తకంతోపాటు ఇతర అన్ని రంగాలకూ తగిలింది. కార్ల తయారీదారుల నుంచి రిటైలర్ల వరకు అందరిపైనా దీని ప్రభావం కనిపిస్తున్నది. 

బ్యాంకుల రుణాలు తగ్గి వినియోగ సామర్థం బలహీనపడింది. ఇక ఆభరణాల రంగం గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ రత్నాలు, నగల పరిశ్రమకు.. జీడీపీలో ప్రధాన వాటానే ఉన్నది. ఈ రంగం దాదాపు 50 లక్షల మందికి ఉపాధినిస్తున్నది. జీడీపీలో సుమారు 7 శాతం, ఎగుమతుల్లో 15 శాతం వాటాలను కలిగి ఉన్నది. అయినా ఈ రంగానికిప్పుడు రుణాలు చాలా దూరమయ్యాయి. 

నిరుడు మార్చి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌దాకా వచ్చిన రుణాలు గతంతో పోల్చితే 14 శాతం పడిపోయాయి. దీనివల్ల వ్యాపారం మందగించి చాలామంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తున్నది. 
‘వజ్రాల పరిశ్రమలో నా 40 ఏండ్ల అనుభవంలోనే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదు’ అని సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబూభాయ్ కత్రియా వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

దేశంలోనే వజ్రాల పాలిషింగ్‌కు సూరత్ ప్రధాన కేంద్రం. ప్రపంచంలోని 15 ముడి వజ్రాల గనుల్లో 14 గనుల ఉత్పత్తిని ఇక్కడి సంస్థలే పాలిష్ చేస్తుంటాయి. డీ బీర్స్, అల్రోసా పీజేఎస్‌సీ వంటి ప్రముఖ సంస్థలకు ఇక్కడ కేంద్రాలు ఉన్నాయి.

Read also: ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌తో ‘డిష్‌’టీవీ విలీనం!

నీరవ్ మోదీ మోసం పరిశ్రమకు ప్రధానంగా నగదు కొరతను తెచ్చిపెట్టింది. ఒకప్పుడు బ్యాంక్ రుణాలకు కొదవే లేదని, ఇప్పుడు రుణాలు అడిగేందుకు వెళ్లాలంటే ఏదోలా ఉందని సూరత్ వ్యాపారులు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత విషమించిందో అర్థమవుతూనే ఉంది. 

ఈ క్రమంలో దిగుమతులు-ఎగుమతులు చేయలేని స్థితికి వచ్చామని వ్యాపారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దేశంలోకి ముడి వజ్రాల దిగుమతి 22 శాతం పతనమైందని, పాలిష్ వజ్రాల ఎగుమతి 18 శాతం క్షీణించిందని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) గణాంకాలు చెబుతున్నాయి.

ఇక నీరవ్‌కు ఇక్కడ పాలిష్ యూనిట్ ఉండగా, అది మూతబడటంతో పని వాళ్లంతా రోడ్డునపడ్డారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గి నైపుణ్యం ఉన్న వారికీ జీతాలు పడిపోయాయి. ఒక్క సూరత్‌లోనే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. 
సూరత్ నగరంలో దాదాపు 5 వేల పెద్ద, చిన్న పాలిష్ యూనిట్లు ఉన్నాయి. నీరవ్ బాగోతంతో వీరందరి భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడిందని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios