Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్+అమెజాన్‌లకు పెను సవాల్: రిలయన్స్‘సూపర్ యాప్’


ఒకే యాప్‌లో 100కి పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సదరు యాప్ డిజైన్ చేస్తోంది. అది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కాగలదు.  
 

'Super app' to place Reliance Jio in pole position
Author
Mumbai, First Published May 2, 2019, 9:58 AM IST

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌-సంప్రదాయ దుకాణాలను అనుసంధానించేలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘సూపర్‌యాప్‌’ను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేస్తోంది. అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా రూపొందిస్తున్న ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొబైల్‌ ద్వారా 4జీ డేటా సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సహకారంతో దీన్ని అత్యధికులకు చేరువ చేయాలన్నది ముకేశ్‌ ప్రణాళిక.

సూపర్‌యాప్‌తో ఈ- కామర్స్‌ సేవలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌లు, చెల్లింపుల వంటివన్నీ పూర్తి చేసుకోవచ్చు. 100కు పైగా సేవలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందించాలన్నది రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ ప్రణాళిక.

అంతేకాదు 2021 నాటికి దేశీయ ఈ-కామర్స్‌ విపణి విలువ రూ.5.88 లక్షల కోట్లకు చేరుతుందని డెలాయిట్‌ ఇండియా, రిటైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేశాయి. రెండేళ్ల క్రితం అంటే 2017లో దేశీయ ఈ-కామర్స్‌ విపణి స్థాయి రూ.168000 కోట్లకు చేరుతుందని అంచనా వేశాయి. 

ఈ- కామర్స్‌ వ్యాపారంతో 3 కోట్ల మంది వ్యాపారులను అనుసంధానించాలని ముకేశ్‌ అంబానీ లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ జియోకు 30 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. 

అనేక టెక్‌ సంస్థలను కొనుగోళ్లు చేయడం, కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం కోసం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చర్యలు చేపట్టారు. త్వరలో ప్రారంభమయ్యే గిగాఫైబర్‌ సేవల ద్వారా, గృహ-కార్యాలయ-వాణిజ్య సంస్థలకు అత్యధిక వేగం డేటా ద్వారా, పూర్తిస్థాయి వినోద సేవలు లభించనున్నాయి. సూపర్‌యాప్‌కు ఇది కూడా ఉపయోగ పడుతుంది.

సంభాషణా పూర్వక కృత్రిమ మేధ (ఏఐ), లాజిస్టిక్‌, ఏఐ ఆధారిత విద్యా సేవలు కూడా  సూపర్‌యాప్‌ ద్వారా అందుబాటులో రానున్నాయి. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సామర్థ్యం అండగా ఉండటంతో, చైనాకు చెందిన వుయ్‌చాట్‌ స్థాయి యాప్‌ మనదేశం నుంచీ ఆవిర్భవించినట్లు అవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 

ఈ ఘనతను స్నాప్‌డీల్‌, పేటీఎం, ఫ్రీఛార్జ్‌, ఫ్లిప్‌కార్ట్‌, హైక్‌ కూడా సాధించలేకపోయాయని చెబుతున్నారు.‘ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సేవలను కూడా అనుసంధానించే అవకాశం సూపర్‌యాప్‌ ద్వారా కలుగుతుందని, అన్ని సేవలు ఒకేచోట లభ్యమవుతాయి’ అని  రిలయన్స్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ అధిపతి ప్రభురామ్‌ పేర్కొన్నారు. రిలయన్స్ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే అటువంటి సెల్ఫ్ కంటైన్డ్ నెట్ వర్క్ గల దేశంగా భారత్ నిలుస్తుందన్నారు.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏం చేసినా ముందుగానే సంకేతాలిస్తారు. గతేడాది నవంబర్ నెలలో ‘మేకిన్ ఒడిశా సదస్సు’లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆన్ లైన్ టు ఆఫ్ లైన్ న్యూ కామర్స్ ప్లాట్ ఫామ్ స్రుష్టించడంపైనే ద్రుష్టి సారించిందని చెప్పారు. మొబైల్ బిజినెస్ విజయవంతం కావడంతో నెక్స్ట్ జనరేషన్ గిగా ఫైబర్ ఎఫ్టీటీహెచ్ సర్వీసెస్ విషయమై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హోం అండ్ ఎంటర్ ప్రైజెస్ కనెక్టివిటీపైన రిలయన్స్ కేంద్రీకరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios