ముంబై: సైరస్‌ మిస్త్రీతో పోరులో టాటాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు చెల్లదని, మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించాలంటూ జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గల అవకాశాలపై టాటా సన్స్ యాజమాన్యం ద్రుష్టి సారించినట్లు 

ఎన్సీఎల్ఏటీ తీర్పు మాటెలా ఉన్నా టాటా సన్స్ గ్రూప్ ఉద్యోగులతా వ్యాపారాలపై ద్రుష్టిని కేంద్రీకరించాలని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సూచించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తన నియామకం చెల్లదని ఎన్సీఎల్ఏటీ తీర్పు చెప్పిన నేపథ్యంలో చంద్రశేఖరన్ ఉద్యోగులకు లేఖ రాశారు.

also read  హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

కొన్ని విషయాలను పక్కనబెట్టి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తన నియామకాన్ని ఎన్సీఎల్ఏటీ తప్పుబట్టిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం విషయమై గ్రూప్ న్యాయపరమైన చర్యలు చేపట్టే అంశాన్ని టాటా సన్స్ చూసుకుంటుందని స్పష్టం చేశారు.

అదే సమయంలో గతంలోకంటే కంపెనీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ దిశగా ఉద్యోగులంతా వ్యాపారాలపైనా, వాటాదారుల సంక్షేమం పైనా కేంద్రీకరించాలని చంద్రశేఖరన్ సూచించారు. తాను 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించినప్పుడు ముఖ్యంగా కంపెనీ స్థిరత్వం, ఆర్థికంగా ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పడంపై కేంద్రీకరించామని గుర్తు చేశారు.

150 సంవత్సరాలుగా టాటా సన్స్ గ్రూపు కాపాడుకుంటూ వస్తున్న నైతిక ప్రమాణాలను టాటా సన్స్ ఉద్యోగులు, సంస్థ యాజమాన్యం కొనసాగించామని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించుకోవడంతోపాటు వాటాదారుల సంక్షేమాన్ని కాపాడటం ఒకవైపు, వ్యాపారాభివ్రుద్ధి, భవిష్యత్‌కు అనుగుణంగా రూపాంతరం చెందడం అనే రెండు అంశాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని ఉద్యోగులకు చంద్రశేఖరన్ సూచించారు. 

also read  ఫ్రీడం కావాలి... కేంద్ర మంత్రికి తేల్చి చెప్పిన కార్పొరేట్ ఇండియా

ఎన్సీఎల్ఏటీ తీర్పు టాటా గ్రూప్‌ భవిష్యత్‌ను మిస్టరీగా మార్చింది. గ్రూప్‌ పెట్టుబడి ప్రణాళికలను అనిశ్చితిలోకి నెట్టింది. ఈ కేసు అనూహ్య మలుపు తిరిగి న నేపథ్యంలో టాటా కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లవచ్చని, గ్రూప్‌ వ్యాపారాలకు నిధుల సేకరణలో ఇబ్బందులు పెరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యవసానంగా గ్రూప్‌ కంపెనీల పెట్టుబడుల జోరు తగ్గవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

టాటా సన్స్ గ్రూప్ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా మిస్త్రీకే అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. మిస్త్రీ పగ్గాలు చేపట్టకుండా నిలువరించేందుకు టాటా సన్స్‌ బోర్డు ముందు మరిన్ని మార్గాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. 

బోర్డు సైరస్ మిస్త్రీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని, ఆయనకు తిరిగి చైర్మన్‌ పదవి అప్పగించే విషయమై వాటాదారుల ఓటింగ్‌ కోరవచ్చని వారు అంటున్నారు. ఒకవేళ బోర్డు, వాటాదారులు మిస్త్రీ పునర్నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. చంద్రశేఖరన్‌కు తిరిగి పగ్గాలు అప్పగించేందుకు వీలుంటుంది.