న్యూఢిల్లీ: దేశంలో వ్యాపార నిర్వహణకు మరింత అనుకూల పరిస్థితులను  కేంద్రానికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సూచించాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ అధ్యక్షుడు బాల్‌కృష్ణ గోయెంకా, ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమానీ తదితర సంస్థల ప్రతినిధులు కలిశారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పురోగతికి చర్యలు చేపట్టినప్పుడే వ్యాపార, పారిశ్రామిక రంగాలకు మరింత స్వేచ్ఛ లభించగలదని సూచించారు. ‘నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒక్కటే. దేశంలో వ్యాపార నిర్వహణను సులభం చేయాలి’ అని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ తర్వాత భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్‌ సునీల్ మిట్టల్ మీడియాకు తెలిపారు.

also read  ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ లో సల్మాన్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ...

భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు మరింత స్వేచ్ఛ అవసరమని, అప్పుడే ఇండస్ట్రీ శక్తి, సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయని సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. దేశీయ టెలికం పరిశ్రమను తామంతా కలిసి చంపేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

అధిక వినియోగం ఉన్నా ధరల యుద్ధం కారణంగా చార్జీలు లాభదాయకంగా లేక టెలికం పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతున్నదని అన్నారు. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఆదాయం పన్ను (ఐటీ) అంశాలపైనా మంత్రితో చర్చించిన పరిశ్రమ.. విలీనాలు-కొనుగోళ్లకు ఐటీ సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయని పేర్కొన్నది.

నెలసరి వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం తగ్గితేనే.. కొనుగోళ్లు పెరుగుతాయని మంత్రికి తెలిపినట్లు ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమని వెల్లడించారు. ఈఎంఐలు తగ్గాలంటే బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాలన్నారు. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే పరిశ్రమకు మేలు జరుగుతుందని సూచించినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును ఈ ఏడాది 135 బేసిస్ పాయింట్లు తగ్గించిందని, బ్యాంకర్లు మాత్రం ఆ స్థాయిలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చలేదని గుర్తుచేశారు. ఏడాదికి రూ.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిపై ఆదాయం పన్ను తగ్గించాలని కోరినట్లు చెప్పారు. దివాలా ప్రక్రియపై పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సందీప్ సోమని తెలియజేశారు.

also read  ఐసీయూలో ఇండియన్ ఎకానమీ...తేల్చేసిన సుబ్రమణ్యం

ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యాపార సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రీ-బడ్జెట్ చర్చల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పలు వాణిజ్య సంఘాలు కలుసుకున్నాయి. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉన్నవారికీ ఐటీ మినహాయింపు ఇవ్వాలని కోరాయి. కనీస వేతనం రూ.21 వేలుగా ఉండాలని, ఉద్యోగ పెన్షన్ పథకం కింద కనీసం రూ.6 వేలు అందించాలని డిమాండ్ చేశాయి. 

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపైనా ఆందోళన వ్యక్తం చేసిన సంఘాలు.. ప్రభుత్వ సంస్థల విలీనాలు, మూసివేతలను నిరసించాయి. ఇక మౌలిక, సామాజిక, వ్యవసాయ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సూచించాయి.