Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్లకు రీ ఎంట్రీతో ‘శాంత్రో’ రికార్డులు.. 23 వేలు దాటిన బుకింగ్స్

కార్ల కొనుగోళ్లలో హ్యుండాయ్ నూతన శాంత్రో రికార్డులు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో 14,208 కార్ల కోసం ప్రీ బుకింగ్స్ నమోదు కావడం గమనార్హం.

New 2018 Hyundai Santro Launched In India, Prices Starting At Rs 3.89 lakh
Author
New Delhi, First Published Oct 24, 2018, 2:06 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ కారు ‘శాంత్రో’ను నాలుగేళ్ల తర్వాత మళ్లీ దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నూతన అవతారం ఎత్తిన ఈ కారు రూ.3.89 లక్షల నుంచి రూ.5.64 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. అయితే ఈ ధరలు తొలి 50 వేల బుకింగ్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

డిసెంబర్ 2014లో దేశవ్యాప్తంగా శాంత్రో విక్రయాలను నిలిపివేసింది. తాజాగా నాలుగు సిలిండర్ 1.1 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ), సీఎన్‌జీని కూడా ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించింది. 

వీటిలో ఏఎంటీ మోడల్ రూ.3.89 లక్షల నుంచి రూ.5.45 లక్షల మధ్యలో, సీఎన్‌జీ రకం రూ.5.23 లక్షల నుంచి రూ.5.64 లక్షల మధ్యలోనూ, ఆటోమేటెడ్ గేర్ షిప్ట్ కలిగిన మోడల్ రూ.5.18 లక్షల నుంచి రూ.5.46 లక్షల మధ్యలో నిర్ణయించింది సంస్థ. 2014 నాటి వరకు అందుబాటులో ఉన్న శాంత్రో కారు మాత్రం రూ.3.09-4.15 లక్షల మధ్యలో లభించింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ధరలు తొలి 50 వేల కస్టమర్లకు మాత్రమేనని, ఆ తర్వాత ధరలు పెంచే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

ఈ నూతన కారుకోసం గడిచిన రెండు వారాల్లో 23,500 బుకింగ్‌లు వచ్చాయి. ఈ నూతన మోడల్‌ను తీర్చిదిద్దడానికి గత మూడేళ్లలో 100 మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు) పెట్టుబడిగా పెట్టినట్లు హెచ్‌ఎంఐఎల్ ఎండీ, సీఈవో వైకే కూ తెలిపారు.

తొలిసారిగా కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ నూతన మోడల్ సరిగ్గా సరిపోతుందని, ఈ మోడల్ సంస్థకు చాలా కీలకమని హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ వైకే కూ వ్యాఖ్యానించారు. నెలకు 8,000-9,000 యూనిట్ల విక్రయాలు జరుపాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ నూతన కారును డిజైనింగ్ చేయడానికి కొరియా, హైదరాబాద్‌లలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లు కీలక పాత్ర పోషించాయన్నారు. 

మారుతి సుజుకీకి చెందిన వ్యాగన్ ఆర్, సెలేరియో, టాటా మోటార్స్‌కు చెందిన టియాగోలకు పోటీగా సంస్థ శాంత్రోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎగుమతులపై కూ స్పందిస్తూ..వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా 15-20 వేల శాంత్రో కార్లను ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు హెచ్‌ఎంఐఎల్ ఎండీ, సీఈవో వైకే కూ చెప్పారు. 

90 శాతం దేశీయంగా తయారైన విడిభాగాలతో తయారైన ఈ కారులో రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ ఏసీ వెంట్స్, మాటలను గుర్తించే పరికరం వంటి నూతన ఫీచర్స్ ఉన్నాయి. పెట్రోల్ కారు 20.3 కిలోమీటర్లు, సీఎన్‌జీ రకం 30.38 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ సెగ్మెంట్లో తొలిసారిగా వెనుక సీట్లకు కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు. కొత్త శాంత్రోలోని స్పోర్ట్స్‌, ఆస్టా రకాల్లో ఏడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ అందుబాటులో ఉంది. దీనికి బ్లూటూత్‌, నేవిగేషన్‌ వంటివి అనుసంధానం చేసుకోవచ్చు.1998లో చెన్నై ప్లాంట్లో తయారైన ఈ మోడల్ అంతర్జాతీయంగా 18.6 లక్షల యూనిట్లు అమ్ముడవగా, అదే భారత్‌లోనే 13 లక్షలు అమ్ముడవడం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios