న్యూఢిల్లీ: దేశీయంగా కమర్షియల్ వాహనాలు మినహా ప్యాసెంజర్‌ వాహనాలతోపాటు మిగతా రెండు విభాగాల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం పట్ల ఆటోమొబైల్‌ కంపెనీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత జనవరిలో ప్రయాణ వాహనాల అమ్మకాలు 1.87 శాతం తగ్గడంతో వరుసగా మూడో నెలలోనూ అమ్మకాలు తగ్గినట్లైంది. 

వాణిజ్య వాహనాల విక్రయాల్లో స్వల్పంగా 2.21 శాతం పురోగతి నమోదైంది. 2018తో పోలిస్తే 2019 మొదటి నెలలో కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 87,591 యూనిట్లు పెరిగాయి. మధ్య, భారీ తరహా కమర్షియల్ వెహికల్స్ అతి స్వల్పంగా 0.74 శాతం ఎక్కువగా అమ్ముడు పోయాయి. గతేడాది 34,204 కమర్షియల్ వాహనాలను విక్రయిస్తే ఈ ఏడాది 34,456 వాహనాలను అమ్మారు. 

దేశీయంగా లైట్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ 3.19 శాతం పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ విభాగంలో 53,135 వాహనాల విక్రయాలు పెరిగాయి. ఇక త్రిచక్ర వాహనాల్లో పూర్తిగా డౌన్ ట్రెండ్ నమోదైంది. 13.59 శాతం సేల్స్ తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 54,043 త్రిచక్ర వాహనాల విక్రయాలు పడిపోయాయి.

జనవరిలో 2,80,125 ప్యాసెంజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయని భారత ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ సొసైటీ (సియామ్‌) పేర్కొంది. గతేడాది ఇదే నెలలో 2,85,467 యూనిట్ల అమ్మకం జరిగింది. దేశీయంగా వరుసగా మూడో నెలలోనూ కార్ల అమ్మకాలు తగ్గాయి.
 
జనవరిలో 1,79,389 యూనిట్ల వాహనాల అమ్మకం జరగ్గా గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 1,84,264 యూనిట్లతో పోల్చితే 2.65 శాతం క్షీణత నమోదైంది. పండగల సీజన్‌ సందర్భంగా అమ్మకాలు అంతంగా మాత్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో జనవరిలోనూ డీలర్ల వద్ద ఉన్ననిల్వలను తగ్గించుకోవడంపైనే కంపెనీలు దృష్టి సారించాయని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు. 

ఫలితంగానే అమ్మకాలు తగ్గినట్టు సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ చెప్పారు. జనవరిలో హోల్‌సేల్‌ కన్నా రిటైల్‌ సేల్‌ మెరుగ్గా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో డిమాండ్‌ పెరగడానికి అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

మారుతి సుజుకి ప్యాసెంజర్‌ కార్ల అమ్మకాలు 0.18శాతం పెరిగి 1,39,440 యూనిట్లకు చేరాయి. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 0.65 వృద్ధితో 45,803 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా 23,864 ప్యాసెంజర్‌ వాహనాలను విక్రయించింది. 
హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు 51.67 శాతం పెరిగి 14,383 యూనిట్లకు చేరాయి.

ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. జనవరిలో మొత్తం అమ్మకాలు 5.18 శాతం తగ్గి 16,84,761 యూనిట్ల నుంచి 15,97,572 యూనిట్లకు చేరాయి. మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు జనవరిలో 2.55 శాతం తగ్గి 10,54,757 యూనిట్ల నుంచి 10,27,810 యూనిట్లకు చేరుకున్నాయి. హీరో మోటోకార్ప్‌ బైక్‌ల అమ్మకాలు 4.95శాతం తగ్గి 5,16,451 బైక్‌లకు చేరాయి. బజాజ్‌ ఆటో విక్రయాలు 24.67 శాతం పెరిగి 2,03,358 యూనిట్లకు చేరుకున్నాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా బైకుల అమ్మకాలు 1,28,525 యూనిట్లుగా నమోదయ్యాయి.