హిందుజా గ్రూప్ సంస్థ అనుబంధ భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కూడా దేశీయంగా కాలుష్య రహిత ఉత్పత్తుల దిశగా ఒక అడుగు ముందుకేసింది. వచ్చే ఏడాది జనవరిలోగా విద్యుత్ వినియోగ వాహనాన్ని రోడ్డుపైకి తేనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి తెలిపారు. విద్యుత్ వాహన ప్లాంట్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నదన్నారు. జనవరిలో గుజరాత్‌లోని ప్లాంట్ నుంచి తొలి తరం విద్యుత్ వాహనాలు బయటకు వస్తాయన్నారు. ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులో భాగంగా తొలి తరం విద్యుత్ ఆధారిత వాహనాన్ని చూడొచ్చునని తెలిపారు. 

వచ్చే జనవరిలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు గుజరాత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అశోక్ లేలాండ్ విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళికకు తుది రూపు ఇచ్చామని సంస్థ ఎండీ వినోద్ కే దాసరి తెలిపారు. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. 

ఎటువంటి బస్సునైనా తమ ఉత్పాదక యూనిట్ అసెంబ్లింగ్ చేస్తుందని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి పేర్కొన్నారు. అందులో విద్యుత్ ఆధారిత వాహనాలు కూడా ఉన్నాయి. తమ సంస్థ లైట్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్ పై కేంద్రీకరించిందన్నారు. 2020 నాటికి అవి రోడ్లపైకి వస్తాయని చెప్పారు. డిఫెన్స్ రంగంలోనూ గెలుచుకున్న ప్రతి ఆర్డర్ ను పూర్తి చేశామన్నారు. 

అశోక్ లేలాండ్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గోపాల్ మహాదేవన్ మాట్లాడుతూ పరిశ్రమలో నెలకొన్న ఆందోళనలు తమను వెంటాడుతున్నాయని చెప్పారు. వచ్చే త్రైమాసికాల్లో తమ మార్కెట్ ఎలా అభివ్రుద్ది చెందుతుందో వేచిచూడాల్సిందేనన్నారు. నాలుగో త్రైమాసికం నాటికి కోలుకుంటామని పేర్కొన్నారు. అధిక స్టీల్ ధరలు, ఇన్ పుట్ ధరలు తమకు ఇబ్బందికరంగా మారాయని గోపాల్ మహాదేవన్ అన్నారు. దీనివల్ల అశోక్ లేలాండ్ ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే అశోక్‌ లేలాండ్‌ సీఈవో- ఎండీ(సీఎండీ) పదవి నుంచి వినోద్‌ దాసరి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 తేదీన తాను సీఈవోగా వైదొలగనున్నట్లు వెల్లడించారు. ‘14 ఏళ్లపాటు అశోక్‌ లేలాండ్‌ సంస్థకు సీవోవోగా, సీఈవో-ఎండీగా సేవలు అందించిన వినోద్‌ దాసరి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించనున్నారు’ అని అశోక్‌ లేలాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన రాజీనామాను బోర్డు ఆమోదించినా మార్చి 31 వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది.

‘కంపెనీ వృద్ధిలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పరిశ్రమలో అశోక్‌ లేలాండ్‌ను ఆయన ఒక శక్తిగా తీర్చిదిద్దారు. ఆయన బృందం సారథ్యంలో కంపెనీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది’ అని కంపెనీ ఛైర్మన్‌ ధీరజ్‌ జీ హిందుజా తెలిపారు. వినోద్‌ రాజీనామా చేయడంతో ధీరజ్‌ జీ. హిందుజా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలోనే కంపెనీ నామినేషన్స్‌, రెమ్యూనిరేషన్స్‌ కమిటీ భేటీ అయి కొత్త సీఈవో, ఎండీ కోసం అన్వేషణ ప్రారంభించనుంది.