ఎవరి ఇల్లు వారికి స్వర్గంతో సమానం. పొద్దంతా బయటికెళ్లి ఎంత కష్టపడ్డా.. తిరిగి మన ఇంటికి వచ్చి నిద్రపోతే ఆ ప్రశాంతతే వేరు. కానీ అలాంటి చోటే అశాంతి ఉంటే జీవితం కష్టంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా ఇంట్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఏన్నో ఏళ్లు కష్టపడి డబ్బులు కూడబెట్టి, అప్పులు చేసి ఇల్లు కడుతుంటారు. కానీ కొత్త ఇంట్లోకి వెళ్లాక చాలామందికి సమస్యలు ఎదురవుతుంటాయి. దాంతో పాత ఇల్లు లేదా అద్దె ఇళ్లే బాగుండేదని అనుకుంటారు. అయితే మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకొని, డబ్బు ఖర్చు చేసి గృహప్రవేశం చేస్తే సరిపోదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. గృహ ప్రవేశ సమయంలో కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవట. మరి గృహ ప్రవేశం రోజు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

గృహప్రవేశం సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

ఇళ్లు శుభ్రం చేయాలి

వాస్తు ప్రకారం.. గృహ ప్రవేశం ముందు ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గృహ ప్రవేశం రోజు ఇంటి ముఖ్య స్థలంలో, అందరికీ కనిపించేలా చీపురు పెట్టకూడదు. ఇంటి మూలన ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఖాళీ చేతులతో వెళ్లకూడదు

సొంత ఇల్లు అయినా, అద్దె ఇల్లు అయినా ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్లకూడదు. శుభప్రదమైన వస్తువులు చేతిలో పట్టుకుని వెళ్ళాలి. డబ్బు లేదా అక్షింతలు, పండ్లు లేదా పూలు చేతిలో పట్టుకుని వెళ్లడం మంచిది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది.

కన్య పూజ 

గృహప్రవేశం రోజు కన్య పూజ చేయాలి. కన్యలకు భోజనం పెట్టాలి. మీ శక్తి మేరకు వారికి బహుమతులు ఇవ్వాలి. ఇలా చేస్తే జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయట.

బట్టల రంగు ముఖ్యం

గృహప్రవేశం రోజు మీరు ఏ రంగు బట్టలు వేసుకుంటారనేది ముఖ్యం. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు నలుపు, నీలం రంగు బట్టలు వేసుకోకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవాలి. వాస్తు ప్రకారం ఇవి శుభప్రదమైన రంగులు. ఈ రంగు బట్టలు వేసుకుని కొత్త ఇంట్లోకి వెళ్తే అంతా మంచే జరుగుతుందట.

కుడికాలు పెట్టి..

వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త ఇంట్లోకి కుడి కాలు ముందు పెట్టి వెళ్లాలి. ముఖ్యంగా స్త్రీలు కుడి కాలు ముందు పెట్టాలి. ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. ఇంట్లో సంతోషం, శాంతి, ఐశ్వర్యం నెలకొంటాయి.

శుభ దినాన.. 

మంచి రోజు, తిథి చూడకుండా ఇల్లు మారకూడదు. గృహ ప్రవేశం ఎప్పుడూ శుభ సమయంలో చేయాలి. దీనికోసం రోజు, తిథి, నక్షత్రం లాంటివి చూసుకోవాలి. మాఘ, ఫాల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు గృహ ప్రవేశానికి మంచివి.