అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిని మార్చే అవకాశం ఉన్నట్టు కన్పిస్తోంది.
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిని మార్చే అవకాశం ఉన్నట్టు కన్పిస్తోంది. ఈ స్థానం నుండి మాజీ సీఐ మాధవ్ పేరును వైసీపీ ప్రకటించింది. మాధవ్ వీఆర్ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో మరో అభ్యర్ధి కోసం వైసీపీ పరిశీలిస్తోంది.
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ స్థానం నుండి గోరంట్ల మాధవ్ వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. ఈ ఏడాది జనవరి మాసంలో మాధవ్ వీఆర్ఎస్‌కు ధరఖాస్తు చేసుకొన్నాడు.
అయితే ఇంతవరకు మాధవ్ వీఆర్ఎస్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించలేదు.ఈ విషయమై మాధవ్ కోర్టును కూడ ఆశ్రయించారు. వీఆర్ఎస్ ధరఖాస్తు సమయంలో మాధవ్ ఇచ్చిన సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేదని పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మాధవ్ వాడిన తుపాకీకి సంబంధించిన బుల్లెట్ల లెక్కలు కూడ సక్రమంగానే అందించినా కూడ తనను వేధిస్తున్నారని మాధవ్ ఆరోపిస్తున్నారు.వీఆర్ఎస్ ధరఖాస్తును కనీసం 90 రోజుల ముందు ఇవ్వాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై ట్రిబ్యునల్ కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలను విన్పిస్తున్నాయి.
మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం తెలపకపోతే నామినేషన్ చెల్లుబాటు కాదు. దీంతో వైసీపీ నాయకత్వం పునరాలోచనలో పడింది. మాధవ్ పోటీ చేసే పరిస్థితి లేకపోతే ఆయన స్థానంలో ఆయన భార్యను బరిలోకి దింపాలనే యోచనలో కూడ ఆ పార్టీ నాయకత్వం ఉంది.
మరో వైపు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప పేరును కూడ వైసీపీ నాయకత్వం హిందూపురం ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపేందుకు యోచిస్తోంది. ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఆధారంగా మాధవ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
