నరసరావుపేట: నరసరావుపేట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయ ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నరసరావుపేట లోక్ సభ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. 

హోరాహోరీగా జరిగిన ఈ పోరులో వైసీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయ భారీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన రాయపాటి సాంబశివరావుపై 1,53, 976 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

అనంతరం శుక్రవారం సాయంత్రం లావు కృష్ణదేవరాయ నేరుగా రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లారు. ఆయనకు శాలువా కప్పి ఆశీస్సులు తీసుకున్నారు. లావు కృష్ణదేవరాయ వచ్చి కలవడం ఆశీస్సులు తీసుకోవడంతో ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు రాయపాటి అతని కుటుంబ సభ్యులు. 

కృష్ణదేవరాయను ఆలింగనం చేసుకుని శాలువా కప్పి సన్మానించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అవి అయిపోయిన తర్వాత అంతా కలిసిమెలిసి సఖ్యతగా ఉంటే ఎంతో బాగుంటుందని అది మంచి సంప్రదాయమనడానికి లావు కృష్ణదేవరాయ వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.