వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అలక వీడలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

తాను వద్దని చెప్పినా జగన్.. మాగుంటను పార్టీలోకి చేర్చుకోవడంపై సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల వేళ ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టలేదు. ఇందుకు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాగుంటతో ఉన్న విభేదాలే కారణమని ఒంగోలులో చర్చించుకుంటున్నారు.

దీంతో సుబ్బారెడ్డి అనుచరవర్గంలో కొందరు టీడీపీలో చేరగా.. మరికొందరు తటస్థంగా ఉండిపోగా, ఇంకొందరు వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఉండగా నియోజకవర్గంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు సుబ్బారెడ్డి అందుబాటులో ఉండేవారు.

కీలక సమస్యలను కేంద్రప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తుండేవారు. తనను మరోసారి గెలిపిస్తే వీటినే పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీలు ఇచ్చేవారు. మరోదఫా తానే పోటీ చేస్తాననే నమ్మకంతో అనుచరులను, కార్యకర్తలను సిద్ధం చేసుకున్నారు.

అయితే జగన్... చివరి నిమిషంలో మాగుంటను రంగంలోకి దించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న వై.వి టిక్కెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో తన వర్గీయులకు ఏం చెప్పాలో తెలియక జిల్లాలో అడుగుపెట్టడం మానేశారు.

మరోవైపు జిల్లాలో వై.వి సుబ్బారెడ్డి వర్గాన్ని... బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. అసలు ఒంగోలు టికెట్‌ను మాగుంటకు కేటాయించడంలో బాలినేని హస్తం ఉందని సుబ్బారెడ్డి వర్గీయులు గట్టిగా నమ్ముతున్నారు.

దీనికి తోడు తనను అవమానించేలా మాట్లాడారని, తమ కుటుంబాన్ని చిన్న బుచ్చారన్న అభిప్రాయంతో మాగుంట కూడా సుబ్బారెడ్డి వర్గాన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఏ వర్గానికి సహకరించాలో తెలియక సుబ్బారెడ్డి అనుచరులు అయోమయంలో పడిపోయారు.