సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రజాసేవ, ట్రస్ట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలపై తాను దృష్టి సారిస్తానని తెలిపినప్పటికీ రాజకీయాల వైపే అడుగులు వేశారు.

లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని భీమిలి లేదా విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు.

ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో జేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయితే విశాఖ లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పేరు ఖరారైనట్లుగా జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అక్కడ కుదరని పక్షంలో కాకినాడ పార్లమెంటు నుంచి జేడీ పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే పవన్ మాత్రం లక్ష్మీనారాయణ సొంత ప్రాంతం రాయలసీమ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది.

కర్నూలు లేదా నంద్యాల నుంచి ఆయనను పోటీ చేయించాలని జనసేనాని భావిస్తున్నారు. కానీ లక్ష్మీనారాయణ మాత్రం విశాఖ వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక రాజధాని కావడంతో పాటు చదువుకున్న వారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వైజాగ్ అయితేనే బెటర్‌ అనే అభిప్రాయంలో జేడీ ఉన్నారు.

ఇవాళ సాయంత్రానికి లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో పవన్‌కు తోడుగా జేడీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించనున్నారు.