విశాఖపట్టణం: విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడును కోరారు.

సోమవారం నాడు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో  టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు.  విశాఖ నుండి శ్రీభరత్‌ను అభ్యర్ధిగా నిర్ణయించాలని కోరుతూ చంద్రబాబుకు తీర్మాణం పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

విశాఖ పార్లమెంట్ స్థానం నుండి శ్రీభరత్‌ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. ఈ కారణంగానే ఈ స్థానం నుండి శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని చంద్రబాబునాయుడుకు సూచించినట్టు ఆయన  చెప్పారు. అయితే తాము మాత్రం విశాఖకు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని కోరామన్నారు.కానీ, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

మరోవైపు వైసీపీ టిక్కెట్లు దక్కని వంశీ, కోలా గురువులు కూడ తనను కలిశారని గంటా  చెప్పారు. అయితే ఈ విషయాన్ని కూడ బాబు దృష్టికి కూడ తీసుకెళ్లినట్టుగా ఆయన వివరించారు. తనకు భీమిలి నుండి పోటీ చేయాలని ఆసక్తి ఉందన్నారు. కానీ, పార్టీ ఆదేశాల మేరకే తాను విశాఖ నార్త్ నుండి పోటీ చేస్తున్నట్టుగా గంటా శ్రీనివాసరావు చెప్పారు.