హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పక్కలో బళ్లెంలా తయారయ్యారు కేంద్రమాజీమంత్రి సర్వే సత్యనారాయణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరెత్తితే చాలు ఒంటికాలిపై లేస్తున్న సర్వే సత్యనారాయణ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. 

ఉత్తమ్ ఎంపీగా పోటీ చేస్తే తాను ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. స్వపక్షంలో విపక్షంగా మారతానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కీలకనేతలు పార్టీ వీడుతుంటే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్‌ కోసం ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారంటూ ఆరోపించారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉత్తమ్ ను తప్పించాల్సిందేనని, నాయకత్వం మార్పు అవసరమంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ప్రక్షాళన జరిగిన నాడే తిరిగి గాంధీభవన్‌లో ఆడుగుపెడతానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. 

ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్‌ పార్టీని మాత్రం వీడేదిలేదని తెలిపారు. మరోవైపు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి సర్వే సత్యనారాయణను కలిశారు. 

మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తనకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఈనెల 22న  నామినేషన్‌ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. మాల్కాజ్‌గిరి అంటే సర్వే సొంత ఇల్లు లాంటిదని ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా రేవంత్‌ కోరారు.