అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని టీడీపీ, వైసీపీలు ప్లాన్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకొన్నాయి.  ఈ దఫా ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇచ్చేవారికి మద్దతును ఇస్తామని వైసీపీ చెబుతోంది. తమకు రాష్ట్రంలోని 25 సీట్లను కట్టబెడితే కేంద్రంలో తాము మద్దతిచ్చే ప్రభుత్వం ఏర్పడుతోందని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలు ఉండేవి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర విభజన పూర్తైంది. అంతకు ముందే  రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు పాసైంది. 2014 జూన్ రెండో తేదీన  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికలు జరగనున్నాయి.  గత ఎన్నికల సమయంలో  టీడీపీ, బీజేపీ కూటమి 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. వైసీపీ 9 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.

ఎన్నికల ఫలితాల తర్వాత నంద్యాల, కర్నూల్ ఎంపీలు టీడీపీ గూటికి చేరారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీ, వైసీపీకి కూడ దూరంగా ఉంటున్నారు.ఇటీవలనే అనకాపల్లి ఎంపీ, అమలాపురం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించిన అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైసీపీ గూటికి చేరారు.

రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబునాయుడు ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు.

సర్వే రిపోర్టుల ఆధారంగా  వైసీపీ నాయకత్వం అభ్యర్థులను నిర్ణయిస్తోంది. తాడేపల్లిలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఫిబ్రవరి 27వ తేదీన జగన్ నూతన గృహా ప్రవేశం చేశారు. రానున్న రోజుల్లో జగన్ ఇదే ఇంటి నుండి పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం కీలకంగా మారనుంది. ఈ అంశం చుట్టూ ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రీకరించి ప్రచారం నిర్వహించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.