రాజంపేట లోక్‌సభ పరిధిలో అభ్యర్థులు బీజేపీకి షాకిచ్చారు. తంబళ్లపల్లె అసెంబ్లీ సెగ్మెంట్‌లో చల్లపల్లి నరసింహరెడ్డికి టికెట్ దక్కలేదు. పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేశారు.

ఈయనను కాదని ఆన్‌లైన్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మంజునాథ్ రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించింది. దీనిపై ఓ వర్గం భగ్గుమంది, పార్టీని నమ్ముకున్న వ్యక్తికి కాకుండా.. ప్రజల్లో లేని వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ వారు ప్రశ్నించారు.

పార్టీ ప్రకటించిన మంజునాథ్‌రెడ్డికి నరసింహరెడ్డి వర్గం సహకరించలేదు. దీంతో తన నామినేషన్‌ను మంజునాథ్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. అలాగే రాజంపేట ఎంపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

ఓ సామాజిక వర్గం ఓట్లు చీలుతాయని అంతర్గత ఒప్పందం జరిగినట్లు సమాచారం రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో తంబళ్లపల్లె, రాజంపేట నియోజకవర్గాల్లో బీజేపీ పోటీలో లేకుండా పోయింది.