మెగా బ్రదర్ నాగబాబుని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనలో చేర్చుకొని ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. నాగబాబు అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో.. ఆయన ప్రత్యర్థులు మాటలదాడికి దిగారు.

తాజాగా నరసాపురం వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు.. నాగబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఓటమి భయంతో నాగబాబు పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సొంత ఊర్లో లైబ్రరీ పెట్టుకుంటామంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకున్న వ్యక్తి నాగబాబు అని ఆరోపించారు. ఆయన గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసన్నారు. 

ఆయన ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. నాగబాబు తీరుతో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల గౌరవం కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని హితవు పలికారు. ఏప్రిల్ 11న ఎవరేంటో తెలిసిపోతుందని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.