నర్సాపురం : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిత్యం తనమనసులో ఉంటారని వైసీపీ నేత రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తన కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో అవినావభావ సంబంధం ఉందని స్పష్టం చేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రఘురామకృష్ణం రాజు వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఎంతో స్నేహబంధం ఉందని గుర్తు చేశారు. 

నామనసులో, ఇంట్లో వైఎస్ఆర్ ఉంటారని చెప్పుకొచ్చారు.  రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తన మనవడికి రాజశేఖర్ రెడ్డి అనే పేరుపెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఓటు పరిస్థితి ఎలా ఉందంటే బహరంగ సభకు హాజరైనవాళ్లు తమ జేబులో పర్సు ఉందో, లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రపంచంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని చెప్పుకొచ్చారు. మన అందరం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావలసిందేని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.