విజయవాడ: విజయవాడ పార్లమెంట్ టికెట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి బిగ్ షాట్లు బరిలోకి దిగుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారుతోంది. కేశినేని నానిని ఢీ కొట్టేందుకు వైసీపీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీ రెడీ అవుతున్నారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పీవీపీని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు పీవీపీ. దీంతో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, పీవీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయితే విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీవీపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించారు. తనపై కేశినేని నాని చేసిన విమర్శలకు సమాధానాలు చెప్పడం టైం వేస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. 

దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చూశామని, మళ్ళీ అలాంటి పాలన రావాలంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యం అవుతుందని పీవీపీ స్పష్టం చేశారు. విజయవాడ స్థానికుడిగా  నియోజకవర్గంలోని సమస్యలు తనకు తెలుసున్నారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. 

రాజధాని ప్రాంతంగా విజయవాడను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతి వైపు పరుగు అనే నినాదంతో ముందుకు సాగుతానని తెలిపారు. విజయవాడలో దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో 150 కోట్లతో మాల్ నిర్మించి 700 మందికి ఉపాధి కల్పించానని చెప్పుకొచ్చారు. 

తాను ఏ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయలేదని, లబ్ది పొందలేదని స్పష్టం చేశారు. విజయవాడ నగరానికి బయట ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సినీపరిశ్రమను విజయవాడకు రావాలని కోరతానని తెలిపారు పొట్లూరి వరప్రసాద్.