ఈ రోజు తనతో పాటు తన కుటుంబానికి అత్యంత ప్రధానమైన రోజన్నారు పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్. బుధవారం ఉదయం వైసీపీలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు పారిశ్రామికరంగంలో ఉన్న తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించానని తెలిపారు.

జగన్ తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఆదేశించారని.. ఆయన ఆదేశాలను పాటిస్తానని పొట్లూరి వెల్లడించారు. విజయవాడ అభివృద్ధే తన అజెండా అని.. రాజకీయాలు తన ఉద్దేశ్యం కాదన్నారు.

విజయవాడను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్‌కు 25 ఏళ్ల విజన్ ఉందని పీవీపీ తెలిపారు. తనను వైసీపీలో చేరేందుకు ఎవరి నుంచి ఒత్తిడి లేదని వరప్రసాద్ స్పష్టం చేశారు. విజయవాడ అభివృద్ధిలో పీవీపీ సంస్థలు కీలకపాత్ర పోషించాని ఆయన తెలిపారు.

సినీరంగానికి చెందిన కార్యక్రమాల్లో హైదరాబాద్, విజయవాడకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పరిశ్రమకు సూచించారు. విజయవాడ నగర మాజీ మేయర్ రత్నిబందు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో తాను మేయర్‌గా పనిచేశానని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు.