కర్నూలు: తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కని ఎస్పీవై రెడ్డి జనసేనలోకి మారి నంద్యాల లోకసభ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టికెట్లు ఇచ్చారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పవన్ మొత్తం నాలుగు టికెట్లు ఇచ్చారు. 

ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యుల పోటీ వల్ల తన పార్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావించారు. దీంతో ఎస్పీవై రెడ్డికి బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు. ఎస్పీవై రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. 

చంద్రబాబు ఆఫర్ కు ఎస్పీవై రెడ్డి ఏ మాత్రం స్పందించలేదు. పోటీ చేయడానికే నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్ కర్నూలు ప్రచార సభల్లో ఎస్పీవై రెడ్డితో పాటు ఆయన అల్లుడు సజ్జల సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్య చేశారు. 

ఆ ఎెమ్మెల్సీ సీటు ఏదో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ కు ఇచ్చుకోవాలని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడంతో కర్నూలు జిల్లాలో పోటీ ఆసక్తికరంగా మారింది.