నెల్లూరు: ఒంగోలు లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడి ఆఫర్ ను తిరస్కరించిన పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీ మారాలనే తన ఆలోచనను మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

వైసిపి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వనం అందినట్లు తెలుస్తోంది. దీంతో వైసిపిలో చేరాలని ఆయన అనుచురులు ఒత్తిడి పెడుతున్నట్లు చెబుతున్నారు. టీడీపి నుంచి ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేయడానికి నిరాకరించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసిపి తరఫున మాత్రం పోటీ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 

అయితే, నెల్లూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు కొందరు సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. సొంత జిల్లా నెల్లూరులో గ్రూప్ రాజకీయాలు నచ్చకనే ప్రకాశం జిల్లాను తన రాజకీయాలకు క్షేత్రంగా ఎంచుకున్నారని సమాచారం. దీంతో ఆయన నెల్లూరు నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. 

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల సమావేశమయ్యారు. ఈ సెగ్మంట్లకు చెందిన టీడీపి ఇంచార్జీలు పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాగుంటను ఆహ్వానించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఈ స్థితిలో వైసిపిలో చేరాలని వారు మాగుంటకు సూచించినట్లు తెలుస్తోంది. వారి సూచనలను విన్న ఆయన ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. మరో మూడు రోజుల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.