టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ కి ఎసరు పెడుతున్నారా..? ఆయన స్థానంలోకి లగడపాటి రాజగోపాల్ ని దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఈ మేరకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇప్పటికే రాయపాటిలో టికెట్ విషయంలో అభద్రతా భావం మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే..తాజాగా రాయపాటి ప్రకటన చేసారనే వాదనలు వినపడుతున్నాయి. శనివారం మీడియాతో మాట్లాడిన రాయపాటి.. నరసరావు పేట పార్లమెంట్ స్థానం తనదేనని ప్రకటించారు. నిజానికి ఆ టికెట్ ఆయనకే కేటాయించే పరిస్థితులు ఉంటే.. ప్రత్యేకంగా ఆయన ప్రకటించుకోవాల్సిన అవసరం రాదు కదా.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక లగడపాటి రాజగోపాల్ విషయానికి వస్తే.. ఆయన ఎప్పటినుంచో చంద్రబాబు విధేయుడుగా ఉంటున్నారు. కాంగ్రెస్ దూరంగా ఉంటున్న ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. లగడపాటికి విజయవాడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఇచ్చేంత సీన్ లేదు.  అందుకే రాయపాటిని తప్పించి.. ఆ సీటుని లగడపాటికి కట్టబెట్టాలని చూస్తున్నారట. ఇందులో ఎంత  నిజం ఉందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.