నరసాపురం: నరసాపురం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు విస్త్రతంగా పర్యటిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో అందర్నీ పలకరిస్తూ ముందుకు పోతున్నారు. 

ఎమ్మెల్యేగా తన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. కౌన్సిలర్ గెలిస్తే ఆ వార్డుకు ఎంతో సేవ చేయవచ్చునని ఎమ్మెల్యే గెలిస్తే కొన్ని అద్భుతాలు చెయ్యవచ్చునని నాగబాబు చెప్పారు. 

ఇక అదే ఎంపీ అయితే చాలా చెయ్యవచ్చునన్నారు. తనకు అహం ఎక్కువ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. తాను ఎవరిని చెయ్యి చాచి ఏది అడగనని స్పష్టం చేశారు. లేకపోతే ఆకలితోనైనా చస్తానేమో కానీ అదికావాలి అని ఒకరిని అడిగే స్థాయికి ఎప్పుడూ రాలేదన్నారు. 

అయితే ప్రజలకు ఏదైనా కావాల్సి వస్తే వారికోసం ఏదైనా చెయ్యడానికి ఎవరితోనైనా పొట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 

తాము అధికారంలోకి వస్తే నరసాపురం పార్లమెంట్ ను ఒక ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. త్వరలో తన కుమారుడు వరుణ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని నాగబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలంతా సోషల్ మీడియాను ఫాలో కావాలని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలను యాక్టివేట్ చెయ్యాలని సూచించారు.