అమరావతి: తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట శాసనసభా నియోజకవర్గం సమీక్షా సమావేశంలో శాసనసభ్యురాలు అనితకు చేదు అనుభవం ఎదురైంది. సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే అనితకు టికెట్‌ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు అధిష్టానం సమక్షంలోనే ఆందోళనకు దిగారు. 

"అనిత వద్దూ.. టీడీపీ ముద్దు" అంటూ వాహనాలపై స్టిక్కర్లు వేసి మరీ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో పాయకరావుపేట టికెట్ అనితకు కేటాయించే విషయంలో టీడీపి అధినేత చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యే అనిత నియోజకవర్గంలోని సొంత పార్టీ క్యాడర్‌ నుంచే అసమ్మతిని ఎదుర్కోవడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. 

"అనిత వద్దు.. టీడీపీ ముద్దు" అంటూ విశాఖలో కొన్ని నెలల క్రితం టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళన కూడా నిర్వహించారు. "మీ ఇంటికి మీ ఆడపడుచు" కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన అనితను నడిరోడ్డు పైనే నిలదీశారు. 

అనిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఆమెకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ కేటాయించవద్దని కొందరు టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.