ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కుటుంబ పరంగా పెద్ద మద్ధతు లభించింది. ఆయన సోదరుడు నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. గత కొంతకాలంగా రాజకీయంగా యాక్టీవ్‌గా ఉన్న ఆయన తమ్ముడికి మద్ధతుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో నాగబాబు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల్లో కుటుంబసభ్యులెవరిని జోక్యం చేసుకోనివ్వనని, చెబుతున్న పవన్... అందుకు తగినట్టుగానే జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు.

అయితే ఇటీవల గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి నాగబాబు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండు పార్టీ సమావేశాల్లోనూ ఆయన ప్రత్యక్షమయ్యారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్.. విశాఖ స్థానానికి సంబంధించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు.

ఉభయగోదావరి జిల్లాల్లోని కీలక స్థానాల్లో ఒకటైన నర్సాపురం విషయంలోనూ జనసేనాని వ్యూహాత్మంగా వ్యవహరించారు. కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు సినీ గ్లామర్ ఉన్న తన అన్నయ్య నాగబాబును ఆ స్థానం నుంచి బరిలోకి దించాలని భావించారు.

ఇప్పటికే నాగబాబు పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నాగబాబు జనసేనలో చేరడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.