భారతదేశంలో రాజకీయాలు, సినీరంగం వేరు వేరుగా చూడలేం. ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారు.. సొంతంగా పార్టీలు పెట్టి జాతీయ పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టించి ముఖ్యమంత్రులుగా ఎదిగారు.

ముఖానికి రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికి రారని అన్న వారి చేత శెభాష్ అనిపించుకున్నారు. ఎంతో మంది పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొట్టమొదటి సారి పార్లమెంటులో అడుగుపెట్టిన వ్యక్తికి ఉండే స్థానం వేరు కదా.

ఆ తొలి సినీనటుడు తెలుగు వ్యక్తి కావడం తెలుగు వారందరికి గర్వకారణం. ఆయన ఎవరో కాదు.. కొంగర జగ్గయ్య. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జగ్గయ్య విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్టు గ్రూపు రద్దయిన తర్వాత ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు. అనంతరం 1956లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

1967లో ఒంగోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. తద్వారా భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సినీనటుడిగా జగ్గయ్య రికార్డుల్లోకి ఎక్కారు.