తాజాగా  గల్లా ఇంటిపై దాడి జరగడంపై టీడీపి వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐటీ దాడులకు నిరసనగా గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్ తో పాటు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగుకు గడువు దగ్గరపడిన నేపథ్యంలో గుంటూరు లోకసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి గల్లా జయదేవ్‌ నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గల్లా జయదేవ్ నివాసంలోనే కాకుండా కార్యాలయంలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

మంగళవారం మధ్యాహ్నం నుంచి ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. గల్లా జయదేవ్‌ చీఫ్‌ అకౌంటెంట్‌ గుర్రప్పనాయుడిని వారు ప్రశ్నిస్తున్నారు. ఆదాయ వివరాలు, ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న మొత్తంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా టీడీపి నేతల నివాసాలే లక్ష్యంగా ఐటీ దాడులకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గల్లా ఇంటిపై దాడి జరగడంపై టీడీపి వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐటీ దాడులకు నిరసనగా గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్ తో పాటు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 

తమ నివాసాలపై కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తోందని, మనో స్థైర్యం దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. దాడులకు భయపడేది లేదని అన్నారు.