హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా లభించడం ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతోంది. 

తాజాగా హైదరాబాద్ లో మాదాపూర్ రైల్వే స్టేషన్ లో ఎస్ వోటీ పోలీసుల తనిఖీలో భారీ సంఖ్యలో నగదు పట్టుబడింది. పోలీసుల తనిఖీలో భాగంగా టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి ఎస్టేట్ కారులో భారీగా నగదు పట్టుకున్నారు. 

ఆ కారు మాగంటి రూపకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారులో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

అయితే రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు, మాగంటి రూపాదేవికి చేరవేసేందుకు ఈ డబ్బును తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రెండు బ్యాగ్ లలో రూ.2 కోట్లను తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయభేరి సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న నిమ్మలూరి శ్రీహరి , అవుటి పండరిలుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు తరలింపుపై ఆరా తీస్తున్నారు.