గుంటూరు: నీతి నిజాయితీ ఉన్నఎంపీగా చేయాల్సిన పనులన్నీ చేశానని, పార్లమెంట్‌లో ప్రధానిని ప్రశ్నించిన వారంలోనే తనకు ఈడీ నోటీసులు పంపించారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, గుంటూరు లోకసభ అభ్యర్థి గల్లా జయదేవ్ అన్నారు. తాను లొంగకపోయే సరికి డిసెంబర్‌లో హీరో మహేశ్ బాబును, ఆ తరువాత తన కుటుంబసభ్యులను, మిత్రులను టార్గెట్ చేశారని, వారిపై ఐటి దాడులు చేశారని ఆయన అన్నారు. 

వ్యాపారంగంలో నీతివంతంగా ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవ పన్నులు చెల్లిస్తున్నామని గల్లా జయదేవ్ అన్నారు.  దేశ ప్రధానిని ప్రశ్నించాలంటే ధైర్యం కావాలని, అందులో రిస్క్ కూడా ఉంటుందని ఆయన అన్నారు. అయినా కూడా హిట్లర్‌లాంటి మోడీతో పోరాడి జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడనని ఆయన అన్నారు. 

గుంటూరులో తన కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎంపీగా చేసిన అభివృద్ధి పనులపై పుస్తకం విడుదల చేశారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న పోరాటంలో పార్లమెంట్ వద్ద ఒక మైక్ పట్టుకుని అదేదో ఘనకార్యం లాగా మాట్లాడుతున్నాడని ఆయన మోదుగులపై వ్యాఖ్యానించారు. 

మోదుగుల అడగకముందే తాను ఏం చేశానో ట్రాక్ రికార్డ్‌పై పుస్తకం సిద్ధం చేశానని, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన మోదుగులకు ట్రాక్ రికార్డు ఉంటే విడుదల చేయాలని ఆయన అన్నారు.