హిందూపురం  వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ చిక్కులు తప్పేలా లేవు. ఉన్నతాధికారులు ఆదేశించినా కూడా మాధవ్ ను అధికారులు రిలీవ్ చేయలేదు. దీంతో.. ఆయన పోటీ నుంచి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. శనివారం గోరంట్ల మాధవ్ వైసీపీ అధినేత జగన్ ని లోటస్ పాండ్ లో కలిశారు.  తన స్థానంలో తన భార్య సవితను ఎన్నికల బరిలో దింపాల్సిందిగా మాధవ్ కోరారు. తన భార్య సవిత పేరిట బీ-ఫారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయన కోరికను జగన్ మన్నించినట్లు తెలుస్తోంది.

2018 సెప్టెంబర్ లో తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల్లో అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న, సీఐ గోరంట్ల మాధవ్ కి, జేసీ కి మధ్య వివాదం రాజుకుంది. ఆక్రమంలో ఆయన తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి వైసీపీలో చేరారు. 

తాజాగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాధవ్ కు  హిందూపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు. ఆయన రాజీనామా చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు  మాధవ్ రాజీనామాకు డిపార్ట్మెంట్ పరంగా ఆమోదం లభించలేదు.  దీంతో ఆయన ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయించారు.  

ఇదిలా ఉంటే..నామినేషన్లు వేయడానికి సోమవారం ఆఖరి తేదీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇంకా సంబంధిత అధికారులు గోరంట్ల మాధవ్ ను రిలీవ్ చేయలేదు. దీంతో.. పరిస్థితి చేయిదాటే స్థితికి వచ్చింది. అందుకే తన స్థానంలో ఎన్నికల బరిలో తన భార్యను దింపాలని మాధవ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు జగన్ ని కలిశారు.