హైదరాబాద్:మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం నాడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరాలని  వారు డీఎల్‌ను కోరారు.

వారం రోజుల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. వైసీపీ నుండి మైదుకూరు నుండి పోటీ చేయాలని  డీఎల్ రవీంద్రారెడ్డి భావించారు. అయితే ఈ స్థానం నుండి సిట్గింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికే జగన్ మరోసారి టిక్కెట్టు కేటాయించారు.

ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని డీఎల్‌కు జగన్ గతంలో హామీ ఇవ్వడంతో ఆయన టీడీపీ వైపు చూశారు. టీడీపీలో కూడ మైదుకూరు టిక్కెట్టు విషయమై స్పష్టమైన హామీ రాలేదు. ఈ స్థానం నుండి టీడీపీ సుధాకర్ యాదవ్ కు కేటాయించింది.

దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా కూడ బరిలోకి దిగాలని భావించారు.  కానీ,  ఈ తరుణంలో మరోసారి వైసీపీ నేతలు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.ఎల్లుండి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.