హైదరాబాద్‌: మాజీమంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైఎస్ జగన్ తో దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. 

ఉత్తరాంధ్ర సమస్యలపై వైఎస్ జగన్ తో చర్చించినట్లు కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. 

ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించినట్లు తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వయం ప్రతిపాదిక సంస్థలు ఉండేవని గుర్తు చేశారు. 

వైఎస్ మొదలుపెట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. పురుషోత్తం ఎత్తిపోతల పథకం, స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు, శ్రీకాకుళంలో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు వంటి అంశాలపై జగన్ తో చర్చించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వంతో ఒప్పించి వాటిని నెరవేర్చాలని సూచించినట్లు తెలిపారు. 

ఉత్తరాంధ్రలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. విజయనగరం ఒకప్పుడు కళలకు కానాచిగా ఉండేదని కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. మత్సకారులు, దళితులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా మేనిఫెస్టోలో కీలక పథకాల రూపకల్పన చెయ్యాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు. అయితే ఏ పార్టీలోచేరాలో అన్న అంశంపై ఆత్మీయులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ.