విశాఖపట్నం: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరాలని జీవీ హర్షకుమార్ ప్రయత్నిస్తున్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ని తెలుగుదేశం పార్టీలోకి చేరాలంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో హర్షకుమార్ భేటీ అయ్యారు. 

విశాఖపట్నం  విమానాశ్రయంలో చంద్రబాబుతో హర్షకుమార్ భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఆదివారం కాకినాడలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సన్నాహక సభ ఉన్న నేపథ్యంలో ఆ సభ సాక్షిగా తెలుగుదేశం పార్టీలో  చేరనున్నారని తెలుస్తోంది. 

జీవీ హర్షకుమార్ అమలాపురం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇదే టికెట్ ను దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు జీఎంసీ హరీష్ ప్రయత్నిస్తున్నారు. హర్షకుమార్ అమలాపురం పార్లమెంట్ కు పోటీ చేస్తే జీవీ హరీష్ అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.