విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులపై జనసేన ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌పై సీబీఐ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయని వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదని స్పష్టం చేశారు. జగన్ కేసులపై సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల ప్రచార సభలో అన్న విషయం తెలిసిందే. అయితే, అలా కుదరదని లక్ష్మినారాయణ అన్నారు.

కోర్టులో అంశాలపై మాట్లాడితే చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్ జగన్‌ చిన్నాన్న మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఉందని తెలిపారు. 

వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు వారి అభిప్రాయాలు బయటకు చెబితే కేసును ప్రభావితం చేసే వీలుందని స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారులు కోర్టుకే బాధ్యులు గానీ ప్రభుత్వానికి కాదంటూ చెప్పుకొచ్చారు. పార్టీలు వారి అభ్యర్థులు గెలవాలని కోరుకుంటుంటే, జనసేన మాత్రం ప్రజలు గెలవాలని కోరుకుంటోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.