నంద్యాల: జనసేన పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీ వై రెడ్డికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీలో చేరాలంటూ ఆహ్వానం పలికారు. టీడీపీ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తే ఆయన కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవప్రదంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. 

టీడీపీ గెలుపుకు సహకరించి నంద్యాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు ఆఫర్ ప్రకటించారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయనన్నారు. 

కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబానికి సీటు ఇవ్వలేకపోయామన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల అవ్వగానే నంద్యాలను జిల్లా చేస్తానని ప్రకటించారు. నంద్యాలను స్మార్ట్‌సిటీగా మారుస్తానని ప్రకటించారు. 

నంద్యాల సీడ్‌ క్యాపిటల్‌గా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తానని తెలిపారు. వ్యవసాయ కళాశాలలో విత్తనాల పరిశోధనపై దృష్టిపెడతామన్నారు చంద్రబాబు. 

డిగ్రీ కళాశాల సైతం ఇస్తానని దాంతోపాటు బాహ్యవలయ రహదారి నిర్మిస్తామని ప్రకటించారు చంద్రబాబు.   ఈ సందర్భంగా నంద్యాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయిస్తామని ప్రకటించారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటు చెయ్యాలన్నదే తన లక్ష్యమన్న చంద్రబాబు నంద్యాల జిల్లా కావాలంటే కుప్పం కంటే ఎక్కువ మెజార్టీతో టీడీపీ గెలవాలని కోరారు.