అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) చిక్కులు కల్పించడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. చంద్రబాబుకు నిఘా సమాచారం కూడా అందకుండా చేశారు. నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ కూడా చంద్రబాబును కలవడం లేదు. 

సీఈవో ఆదేశాలతో ఇంటలిజెన్స్ డీజీ చంద్రబాబుతో భేటీ కావడం మానేశారు. నేరుగా తనకు రిపోర్ట్ చేసే నిఘా విభాగం అదనపు డీజీని కూడా తనకు సీఈవో దూరం చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఆదేశాలతో అదనపు డీజీ (ఇంటలిజెన్స్) తనకు రిపోర్ట్ చేయడం లేదని, తనకు కాకపోతే ఆయన ఎవరికి రిపోర్టు చేస్తున్నారో ఎన్నికల కమిషన్ తెలియజేయాలని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రికి కాకాపోతే అదనపు డిజీ (ఇంటలిజెన్స్) ఎవరికి బాధ్యత వహిస్తారని ఆయన అడిగారు.  ఆయన పనితీరును అంచనా వేసి ఎసిఆర్ రాసే బాధ్యత ఎవరికి అప్పగించారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ భద్రతా సలహాదారు, ఐబి డైరెక్టర్  ప్రధానికి రిపోర్టు చేయరా అని ఆయన ప్రశ్నించారు. 

ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి ఆదేశాలు ఎందుకు జారీ చేయలేదని ఆయన ప్రశ్నించారు .ఆంధ్రప్రదేశ్ పట్ల మాత్రమే ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన అడిగారు.